
తాజా వార్తలు
పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా యువ ఆటగాడు రిషభ్‌పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో అతడు అత్యంత గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడని ప్రముఖులు అభినందిస్తున్నారు. బ్రిస్బేన్ నుంచి అతడు మ్యాచ్ విజేతగా అవతరించాడని అంటున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అయితే పంత్ గ్రేటెస్ట్ ఆఫ్ ది ఆల్‌టైమ్ అవుతాడని అనేశారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, కెవిన్ పీటర్సన్ సహా చాలామంది అతడిని పొగిడేస్తున్నారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుపై టీమ్ఇండియా పట్టు బిగించింది. అందుకు కారణం రిషభ్ పంత్ (101; 118 బంతుల్లో 13×4, 2×6) ప్రత్యేక ఇన్నింగ్సే. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు అతడు ఆచితూచి ఆడాడు. చక్కని బంతుల్ని గౌరవించాడు. చెత్త బంతుల్ని బౌండరీకి తరలించాడు. అర్ధశతకం తర్వాత ఇంగ్లాండ్ స్కోరు సమం కావడంతో ఆపై చెలరేగి ఆడాడు. అండర్సన్, బెన్‌స్టోక్స్, జోరూట్ బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు.
‘అతనెంత బాగా ఆడాడో కదా? నమ్మశక్యం కావడం లేదు. ఒత్తిడిలో అద్భుతమైన ఇన్నింగ్స్. అయితే ఇదే తొలిసారి.. చివరిసారి కాదు. రాబోయే సంవత్సరాల్లో పంత్ అన్ని ఫార్మాట్లలో అత్యంత గొప్ప ఆటగాడు అవుతాడు. అతడిలాగే దూకుడుగా బ్యాటింగ్ చేయాలి. అందుకే అతడు మ్యాచ్ విజేత అయ్యేది’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశాడు.
‘బ్రిస్బేన్‌తో పంత్ తిరిగొచ్చాడు. పంత్ నిజంగా అద్భుత ఆటగాడే!’ అని కెవిన్ పీటర్సన్ అన్నాడు. ‘సిరీస్ సాంతం అందరి దృష్టిలో పడ్డాడు. కానీ ఇది మ్యాచ్‌ను గెలిపించగల ఇన్నింగ్స్. పంత్ నుంచి సంచలన శతకం’ అని ఇయాన్ బెల్ ప్రశంసించాడు. ప్రత్యేకమైన ఆటగాడని మైకేల్ వాన్ అభినందించాడు.
‘టీమ్ఇండియాకు అత్యంత అవసరమైనప్పుడు పంత్ నుంచి విధ్వంసకర శతకం! గిల్లీ తర్వాత ఇలాంటి విధ్వంసకర కీపర్‌ను మళ్లీ చూడలేదు’ అని టీమ్ఇండియా మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ట్వీట్ చేశాడు. ‘నరేంద్ర మోదీ స్టేడియంలో అందరి గౌరవ వందనానికి అతడు అర్హుడే. అతడు ఔటైన బంతిని బలంగా బాదాలనుకున్నాడు. అతడు దూకుడుగా ఆడుతున్న పరిస్థితి అది. అందుకే ఔటై తిరిగొస్తుంటే జట్టు సభ్యులతో సహా అందరూ వందనం చేశారు’ అని వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు.
‘రిషభ్ పంత్ ఇంగ్లాండ్ పేసర్ జిమ్మీ అండర్సన్‌ను స్పిన్నర్‌గా భావించి దాడి చేసినట్టున్నాడు. డామ్బెస్లో ఆత్మవిశ్వాసం లేకపోవడంతో మిగతా ముగ్గురు బౌలర్లపై ఎదురుదాడి చేస్తే తిరుగుండదని పంత్ భావించాడు. జాక్ లీచ్ కొద్ది ఇబ్బంది పెట్టినా పిచ్ సహకరిస్తుండటంతో స్టోక్స్, అండర్సన్ బౌలింగ్‌లో బాదేశాడు. నిజానికి అందులో కొన్ని అద్భుతమైన షాట్లు ఉన్నాయి’ అని సన్నీ గావస్కర్ పేర్కొన్నాడు.