నా చుట్టూ ప్రతికూలతే ఉంది: షూటర్‌ మనుబాకర్‌

తాజా వార్తలు

Updated : 02/08/2021 11:52 IST

నా చుట్టూ ప్రతికూలతే ఉంది: షూటర్‌ మనుబాకర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా తాను 25మీటర్ల పిస్టల్‌ షూటింగ్‌ను కొనసాగిస్తానని భారత షూటర్‌ మను బాకర్‌ స్పష్టం చేసింది. ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్న 19ఏళ్ల మను బాకర్‌కు నిరాశే ఎదురైంది. మూడు విభాగాల్లో పాల్గొన్న ఆమె.. ఒక్క పతకాన్ని కూడా సాధించలేకపోయింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో సౌరభ్‌ చౌదరీతో కలిసి పాల్గొన్న మను బాకర్‌ క్వాలిఫికేషన్‌ స్టేజ్‌-1లో మెప్పించి.. స్టేజ్‌-2లో మెరుగైన ప్రదర్శన చేయలేపోయింది. 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో మను బాకర్‌ 15వస్థానంలో నిలిచి.. ఫైనల్‌కు చేరే అవకాశాల్ని చేజార్చుకుంది. అలా ఒలింపిక్స్‌లో తన పోరు ముగియడంతో శనివారం భారత్‌కు తిరిగొచ్చింది.  ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించింది.

ఒలింపిక్స్‌లో తన షూటింగ్‌ ప్రదర్శన.. సన్నద్ధత విషయంలో ఎన్నో ప్రతికూలతలున్నాయని తెలిపింది. ముఖ్యంగా తనను 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో పోటీపడొద్దని మాజీ కోచ్‌ జస్పాల్‌ రాణా పట్టుబట్టాడని పేర్కొంది. తాను 25 మీటర్ల షూటింగ్‌లో ఆశించినంత మేర రాణించలేకపోతున్నానని అభ్యంతరం వ్యక్తం చేశాడని తెలిపింది. ‘‘ఈ వివాదంలో నా తల్లిదండ్రులను కూడా లాగారు. నేను పోటీల కోసం శిక్షణ తీసుకుంటున్నప్పుడు నాతోపాటు తల్లిదండ్రులు ఉండటంపై ప్రశ్నించారు. ఇవే కాదు.. బయటకు చెప్పలేని మరికొన్ని విషయాల్లో కూడా సమస్యలు తలెత్తాయి’’అని మను చెప్పింది.

చేయాల్సిదంతా చేశారు..

దిల్లీలో గత మార్చిలో నిర్వహించిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌ పోటీల్లో మను బాకర్‌ పాల్గొంటున్న సమయంలోనే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. అప్పటికే ఆమె మాజీ కోచ్‌ రాణాతో వివాదం కొనసాగుతోంది. 25మీటర్ల షూటింగ్‌లో పాల్గొనవద్దని రాణా చెప్పడం.. తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుండటంపట్ల మను అసహనానికి గురైంది. వివాదం ముదరకముందే నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) జోక్యం చేసుకుంది. ఒలింపిక్స్‌కు ముందు తలెత్తిన ఈ వివాదాన్ని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు రణీందర్‌ సింగ్‌ తగిన చర్యలు తీసుకొని పరిష్కరించారని మను పేర్కొంది. రాణాను తొలగించి మాజీ భారత షూటర్‌ రోణక్‌ పండిట్‌ను తన కోచ్‌గా నియమించారని, తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారని వెల్లడించింది. 

ఒలింపిక్స్‌ నుంచి చాలా నేర్చుకున్నా..

ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్న మను బాకర్‌ అక్కడ ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అంటోంది. ‘‘ఒలింపిక్స్‌లో చాలా విషయాలను నేర్చుకున్నాను. ప్రజలు, తోటి క్రీడాకారుల అభిమానం పొందాను. ఇవి కచ్చితంగా భవిష్యత్తు పోటీలకు సన్నద్ధమవడానికి, మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి దోహదపడతాయి. ఈ సారి(ఒలింపిక్స్‌ పోటీలను ఉద్దేశించి) నా ఉత్తమ ప్రదర్శన చేశాను. అయితే, ఇంకా నేను చిన్నదాన్నే. నాకెంతో భవిష్యత్తు ఉంది. రాబోయే పోటీలకు మరింత కఠినంగా శిక్షణ పొందుతున్నాను’’అని తెలిపింది.

షూటింగ్‌ కోచింగ్‌, సిబ్బందిలో భారీ మార్పులు

మను బాకర్‌ మాత్రమే కాదు.. వివిధ విభాగాల్లో పాల్గొన్న ఇతర షూటర్లు కూడా పేలవ ప్రదర్శనతో వెనుదిరిగారు. దీంతో త్వరలో షూటింగ్‌ కోచింగ్‌.. సిబ్బంది విషయంలో సంస్కరణలు చేపట్టనున్నట్లు ఎన్‌ఆర్‌ఏఐ చీఫ్‌ రణీందర్‌సింగ్‌ వెల్లడించారు. ‘‘టోక్యో ఒలింపిక్స్‌లో భారత షూటర్లు ఆశించినంత ప్రదర్శన చేయలేకపోయారు. ఆకస రేంజ్‌లో మన షూటర్లు ప్రతిసారి ఓడిపోతున్నారు. అందుకే షూటింగ్‌, సిబ్బందిలో మార్పుల విషయంపై చర్చించాను’’అని రణీందర్‌సింగ్‌ తెలిపారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని