IPL 2021: దిల్లీ ముందు హైదరాబాద్‌ నిలిచేనా?

తాజా వార్తలు

Updated : 22/09/2021 18:43 IST

IPL 2021: దిల్లీ ముందు హైదరాబాద్‌ నిలిచేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అత్యధిక విజయాలతో దూసుకుపోయిన దిల్లీ క్యాపిటల్స్‌ ఓ వైపు.. ఘోర పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓ వైపు. ఐపీఎల్‌ 2021 రెండో దశలో ఈ రెండు జట్లు నేడు తలపడనున్నాయి. ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఆరు పరాజయాలు చవిచూసి అట్టడుగు స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌స్టో అందుబాటులో లేకపోవడం భారీ లోటు. కాగా ఫామ్‌ లేమితో ఇబ్బందులు పడుతున్న ఈ జట్టుకు నేడు మరో షాక్‌ తగిలింది. ఫాస్ట్‌బౌలర్‌ నటరాజన్‌కు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మరోవైపు అతని క్లోజ్ కాంటాక్ట్‌ అవ్వడం వల్ల ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. ఈ రెండు అంశాలూ హైదరాబాద్‌కు పెద్ద దెబ్బే.

మొదటి దశలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దిల్లీ క్యాపిటల్స్‌ మంచి ఊపు మీద ఉంది. శ్రేయాస్‌ అయ్యర్‌ గైర్హాజరీలో రిషబ్‌ పంత్‌ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. అవసరమైన సమయంలో మంచి వ్యూహాలు రచిస్తూ ఫలితాలు రాబట్టాడు. సీనియర్‌ ఆటగాళ్లు శిఖర్ ధావన్, కాగిసో రబాడతోపాటు హెట్‌మెయర్‌, స్టోయినిస్‌ లాంటి దూకుడుగా ఆడే ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మొదటి దశలో అందుబాటులో లేని శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా జట్టుతో చేరడంతో దిల్లీ మరింత బలంగా కనిపిస్తోంది. ఇక ఇదే సీజన్‌ ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు సూపర్‌ ఓవర్‌లో చేతులెత్తేసింది. కేవలం ఏడు పరుగులే చేయడంతో... దిల్లీ సునాయాసంగా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 

ఇప్పటివరకు దిల్లీపై హైదరాబాద్‌దే పైచేయి అయినప్పటికీ.. ఉత్తమ ఫామ్‌లో ఉన్న దిల్లీ... సన్‌రైజర్స్‌తో జరిగిన చివరి ఐదు మ్యాచ్‌లలో మూడింట్లో విజయం సాధించింది. అదే ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లోనూ దిల్లీ బరిలోకి దిగనుంది. అయితే ఫామ్‌ కోల్పోయి, ఆటగాళ్ల లేమితో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్‌కు ఈ మ్యాచ్‌ గెలవడం సవాలే. ఆశలన్నీ కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ నైపుణ్యానికి తోడు డేవిడ్‌ వార్నర్‌ విధ్వంసం, రషీద్‌ ఖాన్‌ మెరుపులు మెరిపిస్తే సన్‌రైజర్స్‌ గెలిచే అవకాశాలు లేకపోలేదు. అంచనాలు లేని మిడిలార్డర్‌ ఆటగాళ్లు అబ్దుల్‌ సమద్‌, కేదార్‌ జాదవ్‌ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న యువ జట్టు దిల్లీని హైదరాబాద్‌ నిలువరిస్తుందో? లేదో చూడాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని