
తాజా వార్తలు
భయపడతారని భారత్ ముందే ఊహించింది
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ‘స్పిన్’ బలహీనతను టీమిండియా గుర్తుంచి డే/నైట్ టెస్టులో తమకు ప్రయోజనం చేకూర్చుకుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అన్నాడు. మొతేరా వేదికగా జరిగిన గులాబి బంతి టెస్టులో భారత్ చేతిలో ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ వరుసగా 11, 7 వికెట్లతో సత్తాచాటారు.
‘‘ప్రత్యర్థి జట్టు బలహీనతలను టీమిండియా సమర్థవంతంగా గుర్తించింది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మానసికంగా భయపడతారని ఊహించి, అది తమకు లాభంగా మార్చుకుంది. భారత స్పిన్‌ను ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విశ్వాసంతో డిఫెన్స్ చేయలేకపోయారు. భయంతోనే ధాటిగా ఆడలేకపోయారు. బౌలర్ తన లెంగ్త్‌ను మార్చడానికి రివర్స్ స్వీప్ షాట్లు ఆడటం మంచిదే. అయితే టెక్నిక్స్‌తో కాకుండా షాట్లు ఆడి ఎదుర్కోవడం తక్కువ ప్రమాదకరం ఎలా అవుతుంది?’’ అని ఛాపెల్ పేర్కొన్నాడు.
స్పిన్‌ను ఫుట్‌వర్క్‌తో ఎదుర్కోవాలని, అలా చేస్తే సమర్థవంతంగా ఎదుర్కోవడమేగాక, కావాల్సిన ప్రదేశాల్లో షాట్లు ఆడొచ్చని ఛాపెల్ తెలిపాడు. అయితే ఈ నైపుణ్యాన్ని చిన్నతనంలోనే సంపాదించాలన్నాడు. ఇంగ్లాండ్ ఇలాంటివి ఎందుకు నేర్పించలేకపోతుందని ప్రశ్నించాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పోప్ గురించి మాట్లాడుతూ.. స్పిన్‌లో అతడు ఆడాలనుకున్న ఆలోచన బాగుందని, కానీ దాన్ని విజయవంతం చేయలేకపోయాడని పేర్కొన్నాడు. కాగా, మొతేరా వేదికగానే మార్చి 4 నుంచి భారత్×ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టు జరగనుంది.