విరాట్‌ విఫలమైనా బెంగళూరుకు శుభవార్త!

తాజా వార్తలు

Published : 30/09/2020 01:46 IST

విరాట్‌ విఫలమైనా బెంగళూరుకు శుభవార్త!

దుబాయ్‌: పంజాబ్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయినప్పటికీ ముంబయిపై విజయం సాధించిన బెంగళూరును మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభినందించారు. సారథి విరాట్‌ కోహ్లీ విఫలమైనప్పటికీ 200 పరుగుల మైలురాయిని అందుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ అద్భుతంగా ఆడాడని కొనియాడారు. ముంబయి×బెంగళూరు మ్యాచ్‌పై ఆయన తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘ఆకాశ్‌వాణి’లో మాట్లాడారు.

దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచులో కోహ్లీ 3 పరుగులే చేశాడు. నిజానికి అతడు 3 మ్యాచుల్లో కలిపి 18 పరుగులకే పరిమితమయ్యాడు. తన లయ అందుకోలేదు. ఈ పోరులో ఆరంభంలో అద్భుతంగా ఆడిన బెంగళూరు ఫించ్‌, కోహ్లీ వరుసగా ఔటవ్వడంతో ఇబ్బంది పడింది. ఒకానొక దశలో 180 స్కోర్‌ చేయడమూ కష్టమే అనిపించింది. అయితే ఏబీ డివిలియర్స్‌, శివమ్‌ దూబె భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగి ముంబయికి 202 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. ఛేదనలో రోహిత్‌ సేన 201కే పరిమితం కావడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసిన సంగతి తెలిసిందే.

‘కోహ్లీ ఫామ్‌పై ఆందోళన నెలకొనడం వాస్తవమే. అయితే బెంగళూరుకు ఒక శుభవార్త ఉంది. విరాట్‌ భాగస్వామ్యం లేకుండానే ఆ జట్టు 200 పరుగులు సాధించింది. ఇక కోహ్లీ ఫామ్‌ అందుకుంటే ఏం జరగనుంది? ఏమవుతుందో నేను ఊహించి చెప్తాను. వాళ్ల బ్యాటింగ్‌ భీకరంగా మారుతుంది’ అని ఆకాశ్‌ అన్నారు. ‘బెంగళూరు సారథి ఔటయ్యాక ఏబీ డివిలియర్స్‌ తిరుగులేని ఇన్నింగ్స్‌ ఆడాడు. దూబె బంతిని బలంగా బాదాడు. బుమ్రాను ఎదుర్కొని 200 మైలురాయి అందుకున్నారు’ అని పేర్కొన్నారు.

ఛేదనలో విధ్వంసం సృష్టించిన యువ క్రికెటర్‌ ఇషాన్‌ను ఆకాశ్ ప్రశంసించారు. ‘మ్యాచ్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఇషాన్‌దే. ఎందుకంటే అతడి ఆటతీరు అలావుంది. సీజన్‌లో తొలి మ్యాచ్‌ కావడంతో నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. ఆ తర్వాత హిట్టింగ్‌ మొదలుపెట్టాడు. నవదీప్‌, ఉదాన, యూజీ బౌలింగ్‌లో సిక్సర్లు బాదేశాడు. పంత్‌, శాంసన్‌తో పాటు టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించేందుకు పోటీపడుతున్నట్టు చాటిచెప్పాడు’ అని ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని