అల.. యూఏఈలో

తాజా వార్తలు

Updated : 18/09/2021 09:48 IST

అల.. యూఏఈలో

టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో పిచ్‌లపై ఆసక్తి

కరోనా కారణంగా ఈ ఏడాది మేలో అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ సందడి మళ్లీ షూరూ కాబోతుంది. కానీ భారత్‌లో కాదు.. యూఏఈలో. వేదికలు మాత్రమే మారాయంతే.. ఐపీఎల్‌ అందించే కిక్కులో ఎలాంటి తేడా ఉండదు. ఆదివారం నుంచే ఆనందం మొదలు.. పైగా ఈ సారి ప్రేక్షకులను అనుమతించడంతో రెట్టింపు మజా ఖాయం. మరోవైపు ఐపీఎల్‌ ముగిశాక.. ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌నకు ఒమన్‌తో పాటు యూఏఈ కూడా ఆతిథ్యమిస్తుంది. ఈ నేపథ్యంలో యూఏఈలోని స్టేడియాలు.. అందులోని పిచ్‌లపై చర్చ జోరుగా సాగుతోంది. ఓ సారి వాటి విశేషాలు చూసేద్దాం పదండి!

ఐపీఎల్‌-14 రెండో దశ మ్యాచ్‌లకు సిద్ధమైన స్టేడియాలు

గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ పూర్తిగా యూఏఈలోనే నిర్వహించిన సంగతి తెలిసిందే. అబుదాబి, షార్జా, దుబాయ్‌ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పుడు కూడా ఐపీఎల్‌- 14 రెండో దశ మ్యాచ్‌లకు ఈ మూడు స్టేడియాలు వేదికలుగా మారుతున్నాయి. 31 ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత ఒమన్‌తో కలిసి యూఏఈ.. టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ పొట్టి కప్పులో భాగంగా యూఏఈలో కనీసం 36 మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పిచ్‌లు, వాతావరణంపై అందరి దృష్టి పడింది. రెండు నెలల వ్యవధిలో మూడు స్టేడియాల్లో కనీసం 65 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. మ్యాచ్‌లు సాగేకొద్దీ పదే పదే వాడడం వల్ల పిచ్‌లు నెమ్మదించే ఆస్కారం ఉంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు పిచ్‌లో జీవాన్ని నింపడం కష్టంతో కూడుకున్న పని. మొదట్లో పేసర్లకు అనుకూలంగానే ఉండే ఈ పిచ్‌లు టీ20 ప్రపంచకప్‌ సమయానికి స్పిన్నర్లకు సహకరించేలా మారతాయనే అంచనాలున్నాయి. దీంతో గింగిరాలు తిరిగే బంతులను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు సవాలుగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఈ పిచ్‌లపై మ్యాచ్‌లాడడం.. వివిధ దేశాల ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్‌ అని చెప్పొచ్చు. వాళ్లకు ఇక్కడి పిచ్‌లపై మంచి అవగాహన వస్తుందనేది కాదనలేని నిజం. మరోవైపు వేడి ఉష్ణోగ్రత, తేమతో కూడిన వాతావరణం ఆటగాళ్లను పరీక్షించనుంది.

సెప్టెంబర్‌ నెలలో ఇక్కడ సుమారు 40 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉష్ణోగ్రత ఉండనుంది. గత సీజన్‌లో ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 8 మ్యాచ్‌ల్లో, ఛేదన చేసిన జట్లు 12 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. తొలి, రెండో ఇన్నింగ్స్‌ల సగటు స్కోర్లు వరుసగా 140, 129. ఇక్కడ ఇటీవల ముగిసిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో పేసర్లదే ఆధిపత్యం. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఈ మైదానంలో ఓ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక స్కోరు 196. అత్యల్ప స్కోరు 84.

ఇక్కడ 40 నుంచి 41 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవుతుంది. దుబాయ్, అబుదాబితో పోల్చుకుంటే ఈ స్టేడియం చిన్నది కావడం ఫీల్డర్లకు ఉపశమనాన్ని కలిగించేదే. ఇక్కడ బౌండరీల మోత ఖాయం. గతేడాది ఐపీఎల్‌లో ఛేదన చేసిన జట్లు 7 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 5 విజయాలు సాధించాయి. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 149. రెండో ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 131 మాత్రమే. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఈ స్టేడియంలో ఓ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక, అత్యల్ప స్కోర్లు వరుసగా 228, 112.

అబుదాబి, షార్జా కంటే ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. 42 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో ఛేదనలోనే ఎక్కువ విజయాలు దక్కాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 9 మ్యాచ్‌ల్లో గెలవగా.. రెండో సారి బ్యాటింగ్‌కు దిగిన జట్టు 14 మ్యాచ్‌ల్లో లక్ష్యాన్ని చేరుకుంది. తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 144 కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో అది 122గా ఉంది. దుబాయ్‌ స్టేడియంలో గత ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక స్కోరు 219.. అత్యల్ప స్కోరు 109.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని