close

తాజా వార్తలు

భారత్‌పై వెస్టిండీస్‌ విజయం

అర్ధశతకంతో రాణించిన సిమన్స్‌

తిరువనంతపురం: సిమన్స్‌ (67*) చెలరేగడంతో భారత్‌పై వెస్టిండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ రేసులో నిలబడింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. శివమ్‌ దూబే (54) అర్ధశతకం బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్‌ 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లూయిస్‌ (40), పూరన్‌ (38*) మెరిశారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక ఆఖరి టీ20 డిసెంబర్‌ 11న ముంబయిలో జరగనుంది. సిమన్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.

మెరిసిన ఓపెనర్లు
భారత పేలవ ఫీల్డింగ్‌ను వెస్టిండీస్ ఓపెనర్లు లూయిస్‌, సిమన్స్‌ సద్వినియోగం చేసుకున్నారు. సమన్వయంతో ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. సుందర్‌ బౌలింగ్‌లో లూయిస్‌ ఔటవ్వడంతో 73 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. వన్‌డౌన్‌లో వచ్చిన హెట్‌మెయిర్‌ కూడా బ్యాటు ఝుళిపించడంతో విండీస్ రన్‌రేట్‌ మెరుగ్గా సాగింది. జడేజా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన హెట్‌మెయిర్‌ (23) కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. బౌండరీకి దూసుకెళ్తున్న బంతిని పరిగెత్తుకుంటూ వెళ్లి కోహ్లీ అందుకున్న తీరు అద్వితీయం. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పూరన్‌తో కలిసి సిమన్స్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు. బౌండరీ, సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. సుందర్‌, జడేజా చెరో వికెట్‌ తీశారు.

ప్చ్‌.. మరోసారి
తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో నిరాశపరిచిన టీమ్‌ఇండియా మరోసారి పేలవంగా ఫీల్డింగ్‌ చేసింది. సుందర్‌, పంత్‌, శ్రేయస్ క్యాచ్‌లను జారవిడిచారు. భువీ వేసిన ఐదో ఓవర్లోనే వెస్టిండీస్‌ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. సిమన్స్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను సుందర్‌ నేలపాలు చేయగా, లూయిస్‌ ఇచ్చిన క్యాచ్‌ను పంత్‌ జారవిడిచాడు. కీలక సమయంలో శ్రేయస్‌ కూడా క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. చాహర్‌ వేసిన 17వ ఓవర్లో పూరన్‌ ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయస్‌ మిస్‌ చేశాడు.


రాణించిన దూబే
భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పియర్‌ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ (11) ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు రాకుండా శివమ్‌ దూబేని పంపించాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని దూబే నిలబెట్టుకున్నాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌ అంతా స్వేచ్ఛగా ఆడలేకపోతున్నా అతడు మాత్రం బ్యాట్‌ ఝుళిపిస్తూ పరుగులు సాధించాడు. కానీ కొద్దిసేపటికే రోహిత్‌ (15) పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్లు తొందరగానే ఔటైనా కోహ్లీ (19)తో కలిసి దూబే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. బౌండరీలతో విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హేడెన్‌ వాల్ష్‌ బౌలింగ్‌లో దూకుడుగా ఆడే క్రమంలో హెట్‌మెయిర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కొద్దిసేపటికే కోహ్లీ కూడా వెనుదిరగాడు. తర్వాత పంత్ (33*) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. క్రీజులోకి వచ్చిన పంత్‌ తొలుత దూకుడుగా ఆడిన వికెట్లు పడుతుండటంతో తర్వాత నెమ్మదించాడు. శ్రేయస్‌ (10), జడేజా (9), సుందర్‌ (డకౌట్) విఫలమయ్యారు. వెస్టిండీస్‌ బౌలర్లలో విలియమ్స్‌, వాల్ష్‌ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.

శివమ్‌ సిక్సర్లే హైలైట్‌
భారత ఇన్నింగ్స్‌లో దూబే బ్యాటింగ్ హైలైట్‌. పొలార్డ్‌ బౌలింగ్‌లో అతడు సిక్సర్లతో శివమెత్తాడు. కవ్వించిన పొలార్డ్‌కు బ్యాటుతో సమాధానం చెప్పాడు. పొలార్డ్‌ వేసిన 9 ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. డీప్‌స్క్వేర్‌ లెగ్‌, బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌, ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా అతడు బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. తర్వాతి ఓవర్‌లో సింగిల్‌ తీసి 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. తన కెరీర్‌లో ఇదే తొలి హాఫ్‌ సెంచరీ.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.