
తాజా వార్తలు
కోహ్లీవి తొందరపాటు నిర్ణయాలు
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ ఓటిమిపాలై భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అయితే కోహ్లీ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బౌలింగ్‌లో మార్పులు, ఫీల్డర్లను మోహరించడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. తాజాగా కోహ్లీ నాయకత్వంపై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. కోహ్లీ తొందదపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు.
‘‘రెండో మ్యాచ్‌లో షమి రెండు ఓవర్లు వేసిన తర్వాత నవదీప్ సైనికి కొత్త బంతిని అందించాడు. మరో ఎండ్‌లో అతడితో పాటు షమితో కూడా బౌలింగ్ చేయించాలని అలా చేశాడు. అయితే బుమ్రాకి కొత్త బంతిని రెండు ఓవర్లకే పరిమితం చేయడం ఏంటి? బౌలింగ్‌లో క్రమం తప్పకుండా కోహ్లీ మార్పులు చేస్తున్నాడు. కాగా, అతడికి తొలుత అయిదుగురు బౌలర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యతో బౌలింగ్ చేయించాలనే నిర్ణయాన్ని మైదానంలో తీసుకున్నారు. మ్యాచ్‌లో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే ఆరో బౌలర్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు’’ అని నెహ్రా అన్నాడు.
‘‘విరాట్ కోహ్లీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో అతడికి లైఫ్ లభించిన తర్వాత చూస్తే.. అతడు లక్ష్యం 375 పరుగులకు బదులుగా 475గా ఆలోచిస్తున్నాడనిపించింది. అయితే కోహ్లీ తన కెరీర్లో ఎన్నోసార్లు 350 పరుగుల లక్ష్యాన్ని జయించాడు. కాబట్టి ఆ స్కోరు అంత పెద్ద విషయం కాదు. కాగా, కోహ్లీ దుందుడుకు కెప్టెన్. బౌలింగ్‌లో భారీ మార్పులు చేస్తున్నాడు. దానిపై అతడు ఆలోచించాలి’’ అని నెహ్రా పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పవర్‌ప్లేలో బుమ్రా మూడు ఓవర్లే వేశాడు. అతడికి కొత్తబంతితో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించనందుకు నెహ్రాతో పాటు గంభీర్ కూడా కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.