close

తాజా వార్తలు

Published : 24/09/2020 00:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబయి

కోల్‌కతాపై 49 పరుగుల తేడాతో ఘన విజయం

ఇంటర్నెట్‌డెస్క్: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ముంబయి జట్టు లీగ్‌లో ఘనంగా బోణీ కొట్టింది. బుధవారం అబుదాబి వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌సేన 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. భీకర హిట్టర్ల జట్టుగా పేరున్న కోల్‌కతా జట్టు ముంబయి బౌలర్ల ముందు నిలవలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి.. రోహిత్‌ శర్మ (80, 54 బంతుల్లో; 3×4, 6×6) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లలో కమిన్స్‌ (33, 12 బంతుల్లో; 1×4, 4×6) సిక్సర్లతో మెరిశాడు.

పోటీనే కనబరచని కోల్‌కతా
ఛేదన ఆరంభించిన కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. ఆదిలోనే కోల్‌కతా తొలి వికెట్‌ కోల్పోయింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (7, 11 బంతుల్లో; 1×4) పొలార్డ్‌ చేతికి చిక్కాడు. కొద్దిసేపటికే మరో ఓపెనర్‌ నరైన్‌ (9, 10 బంతుల్లో; 1×6) ప్యాటిన్సన్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ డికాక్‌ చేతికి చిక్కాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ కార్తీక్‌ (30, 23 బంతుల్లో; 5×4).. రాణా (24, 18 బంతుల్లో; 2×4,1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. తొలుత నిదానం ఆడినా తర్వాత గేర్‌ మార్చి వేగంగా పరుగులు సాధించారు. కానీ ముంబయి బౌలర్లు పుంజుకొని కార్తీక్‌, రాణాను స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేర్చారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన మోర్గాన్ (16, 20 బంతుల్లో‌, 1×4, 1×6) రసెల్‌ (11, 11 బంతుల్లో; 2×4) జాగ్రత్తగా ఆడటంతో కావాల్సిన రన్‌రేటు భారీగా పెరిగింది. అయినా భీకర బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉండటంతో కోల్‌కతా శిబిరంలో ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే బుమ్రా ఒకే ఓవర్‌లో రసెల్‌, మోర్గాన్‌ను పెవిలియన్‌కు పంపించి కోల్‌కతా ఆశలకు చెక్‌ పెట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాట్స్‌మెన్‌ కూడా పెవిలియన్‌ బాట పట్టారు. ఆఖర్లో కమిన్స్‌ సిక్సర్లతో చెలరేగడంతో కోల్‌కతా ఓటమి అంతరాన్ని తగ్గించుకుంది.

చెలరేగిన హిట్‌మ్యాన్‌.. 
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (80, 54 బంతుల్లో; 3×4, 6×6) అర్ధశతకంతో విరుచుకుపడగా సూర్యకుమార్‌ యాదవ్‌ (47, 28 బంతుల్లో; 6×4, 1×6) మెరిశాడు. ఇన్నింగ్స్‌ ఆదిలోనే డికాక్‌ (1) వెనుదిరిగినా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తూ 90 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 11వ ఓవర్‌లో జట్టు స్కోరు 98 పరుగుల వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సౌరభ్‌ (21, 13 బంతుల్లో; 1×4, 1×6) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్‌ (18, 13 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి హిట్‌మ్యాన్‌ మరింత దూకుడుగా ఆడాడు. పుల్‌షాట్లు, భారీ సిక్సర్లతో అలరించాడు. అతడికి తోడుగా హార్దిక్‌ కూడా మెరవడంతో ముంబయి 220 పరుగులు చేస్తుందని భావించారంతా. కానీ శివమ్‌ మావి  (2/32), రసెల్‌ (1/17) వేసిన వరుస ఓవర్లలో రోహిత్‌, హార్దిక్‌  ఔటవ్వడంతో స్కోరుబోర్డు నెమ్మదించింది. తర్వాత క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (13*)‌, కృనాల్‌ (1) ఆశించిన స్థాయిలో బ్యాట్‌ ఝుళిపించకపోవడంతో ముంబయి 195 పరుగులకే పరిమితమైంది.


బౌలింగ్‌లో పేలవమైనా.. బ్యాటింగ్‌లో అదుర్స్‌ 
వేలంలో కోల్‌కతా రికార్డు స్థాయిలో భారీ మొత్తానికి సొంతం చేసకున్న కమిన్స్‌ బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయాడు. మూడు ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో రోహిత్‌ రెండు సిక్సర్లు, సౌరభ్‌ ఫోర్‌, సిక్సర్‌, హార్దిక్‌ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదారు. అయితే జట్టు ఓటమి అంచుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కమిన్స్‌ సిక్సర్లతో హోరెత్తించాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ బుమ్రా బౌలింగ్‌లో తేలిపోగా కమిన్స్‌ నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. బుమ్రా ఓవర్‌లో 27 పరుగులు సాధించాడు.


రోహిత్‌ నయా రికార్డు
లీగ్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. కోల్‌కతాపై అతడు 875 పరుగులు సాధించాడు. అతడి తర్వాత స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ (829) ఉన్నాడు. వార్నర్‌ కూడా కోల్‌కతాపై సాధించడం గమనార్హం.


200

ఈ మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్‌ లీగ్‌లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. లీగ్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్‌ ఘనత సాధించాడు. తొలి మూడు స్థానాల్లో గేల్‌ (316), ఏబీ డివిలియర్స్‌ (214), ధోనీ (212) ఉన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.