close

తాజా వార్తలు

Published : 20/10/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూపర్‌‌లో మెరుపుల్లేవ్‌!

నాలుగు సీజన్లలో 11 పరుగులకు మించని స్కోర్లు

క్రికెట్‌ అంటే ఒకప్పుడు టెస్టు మ్యాచ్‌లే! ఆ తర్వాతే వన్డేలు. ఇప్పుడు టీ20లు, టీ10ల కాలం. రోజులు మారే కొద్దీ అభిమానుల అభిరుచులు మారాయి. దాంతో క్రికెట్‌ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుల తరబడి సాగే ఆట ఇప్పుడు గంటలు, నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఈ క్రమంలోనే బ్యాట్స్‌మెన్‌ ఆడే షాట్లకు బౌండరీలు చిన్నబోయి, సిక్సర్లు మైదానాలు దాటుతున్నాయి. ఇక ఏటా బీసీసీఐ నిర్వహించే ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ పరుగుల వరదతో మైదానాలు తడిసి ముద్దవుతాయి. అందులోనూ కొన్ని మ్యాచ్‌లు టైగా మారితే ఫలితం కోసం సూపర్‌ ఓవర్లకు వెళ్తే, ప్రేక్షకులు ఉత్కంఠతో ఊగిపోతారు. తాజాగా ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు అదనపు ఓవర్‌కు వెళ్లినా పెద్ద స్కోర్లు నమోదు కాలేదు. దీంతో ఏయే మ్యాచ్‌ ఎలా సాగిందో ఒకసారి పరిశీలిద్దాం.

కరోనా కారణంగా సుమారు ఆరు నెలలు వాయిదా పడినా యూఏఈలో జరుగుతున్న టీ20 లీగ్‌ క్రికెట్‌ ప్రేక్షకులకు పసందైన వినోదం అందిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో 36 మ్యాచ్‌లు జరగ్గా అందులో నాలుగు సూపర్‌ ఓవర్లకు వెళ్లాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ముంబయి, పంజాబ్‌ రెండేసి సార్లు ఆడటం గమనార్హం. అయితే, ఈ నాలుగింటిలో ఏ జట్టు కూడా అదనపు ఓవర్‌లో 11 పరుగులకు మించి భారీ స్కోర్‌ సాధించలేకపోయింది. ఇది కూడా గతరాత్రి జరిగిన ముంబయి, పంజాబ్‌ మ్యాచ్‌లోనే జరిగింది. అందులోనూ తొలి సూపర్‌ ఓవర్‌లో రెండు జట్లు 5 పరుగులే చేశాయి. ఇక రెండోసారి ముంబయి 11 పరుగులు చేయగా పంజాబ్‌ ఆ లక్ష్యాన్ని చేరుకుంది. 

ఈ సీజన్‌లో తొలి సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ రెండో రోజే చోటుచేసుకుంది. పంజాబ్‌, దిల్లీ తలపడిన సందర్భంగా ఇరు జట్లు 157 పరుగులు చేశాయి. ఆపై పంజాబ్‌ సూపర్‌ ఓవర్‌లో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో దిల్లీ విజయం సాధించింది. అనంతరం బెంగళూరు, ముంబయి తలపడిన పదో మ్యాచ్‌లో ఇరు జట్లు 201 పరుగులు చేశాయి. అదనపు ఓవర్‌లో ముంబయి 7 పరుగులు చేయగా బెంగళూరు ఛేదించింది. ఇక ఆదివారం జరిగిన 35వ మ్యాచ్‌లో హైదరాబాద్‌, కోల్‌కతా 163 పరుగులు చేశాయి. సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్‌ 2 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. దాంతో కోల్‌కతా కష్టపడకుండానే గెలుపొందింది. చివరికి ముంబయి, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన 36వ మ్యాచ్‌ సైతం సూపర్‌ ఓవర్‌కే వెళ్లింది. ఇరు జట్లు 176 పరుగులు చేయడంతో సూపర్‌ నిర్వహించారు. ఇక్కడ కూడా ఆ రెండు టీమ్‌లు 5 పరుగులే చేయడంతో రెండోసారి సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. అప్పుడు మళ్లీ బ్యాటింగ్‌ చేసిన ముంబయి 11 పరుగులు చేసింది. పంజాబ్‌ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఆయా జట్లు మంచి స్కోర్లే సాధించినా సూపర్‌ ఓవర్‌లో తేలిపోయాయి.  

మరోవైపు 2017 సీజన్‌ నుంచి పరిశీలించినా ఈ టీ20 లీగ్‌ సూపర్‌ ఓవర్లలో 11 పరుగులే అత్యధిక స్కోర్‌గా నమోదైంది. ఆ ఏడాది గుజరాత్‌, ముంబయి జట్ల మధ్య జరిగిన 35వ మ్యాచ్‌లో రెండు టీమ్‌లు 153 పరుగులు చేశాయి. సూపర్‌ ఓవర్‌లో ముంబయి 11 పరుగులు చేయగా ఛేదనలో గుజరాత్‌ 6 పరుగులే చేసి ఓటమిపాలైంది. 2018లో ఒక్క మ్యాచ్‌ కూడా సూపర్‌ ఓవర్‌కు వెళ్లలేదు. ఇక 2019లో రెండు మ్యాచ్‌లు ఆ పరిస్థితి చేరుకున్నాయి. దిల్లీ, కోల్‌కతా మధ్య జరిగిన పదో మ్యాచ్‌లో ఇరు జట్లు 185 పరుగులు చేశాయి. సూపర్ ఓవర్‌లో దిల్లీ 10 పరుగులు చేయగా కోల్‌కతా 7 పరుగులే చేసి ఓటమిపాలైంది. తర్వాత హైదరాబాద్‌, ముంబయి తలపడిన 51వ మ్యాచ్‌లో ఇరు జట్లు 162 పరుగులు చేశాయి. కానీ సూపర్‌ ఓవర్‌లో హైదరాబాద్ 7 పరుగులే చేయడంతో ముంబయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇలా గత నాలుగు సీజన్లలో ఏ సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్‌ చేయకపోవడం గమనార్హం. దీంతో అసలు మ్యాచ్‌లో ఉండే ఉత్కంఠ సూపర్‌ ఓవర్లలో లేకుండా పోతోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.