
తాజా వార్తలు
వార్నర్ గాయం ఎక్కువ రోజులుంటే బాగుండు
టీమ్ఇండియా ఇంకా సానుకూలంగా ఉంది: కేఎల్ రాహుల్
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు అయిన గాయం పెద్దదైతే బాగుండని టీమ్ఇండియా బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సరదాగా అన్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీసేన బ్యాటింగ్ చేస్తుండగా వార్నర్ ఫీల్డింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం స్పందించిన రాహుల్.. అతడికైన గాయం ఎక్కువ రోజులుంటే బాగుండని సరదాగా పేర్కొన్నాడు. అలా జరగాలని తాను ఏ క్రికెటర్ విషయంలో కోరుకోనని, ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ ఆ జట్టులో కీలక బ్యాట్స్‌మన్ అయినందున ఇలా అంటున్నానని జోక్ చేశాడు. ఒకవేళ అదే జరిగితే భారత్‌కు కలిసి వస్తుందన్నాడు. మరోవైపు వరుసగా రెండు వన్డేల్లో విఫలమైనా టీమ్ఇండియా ఇంకా సానుకూలంగా ఉందని స్పష్టం చేశాడు.
‘మా ఆలోచనా విధానం ఇంకా సానుకూలంగా ఉంది. ప్రత్యర్థి జట్టు మాకంటే బాగా ఆడిందనే విషయాన్ని కొన్నిసార్లు అంగీకరించాలి. వారికిది స్వదేశీ సిరీస్ కావడంతో బాగా ఆడారు. మేం తొలి రెండు వన్డేల్లో ఓడిపోయినా ఇది సుదీర్ఘ పర్యటన కాబట్టి ఇంకా ఆడాల్సింది చాలా ఉంది. ఇలాంటి బ్యాటింగ్ వికెట్లపై సరైన బౌలింగ్ చేయడమే మేమిప్పుడు చేయాల్సి ఉంది. అదే పెద్ద సవాలు. అందుకోసం మా బౌలర్లు కష్టపడుతున్నారు. అయితే, మా ఆటగాళ్లు కొన్ని తప్పులు చేశారు. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ వివరించాడు. అనంతరం బుమ్రాపై స్పందిస్తూ.. అతడెలాంటి బౌలరో అందరికీ తెలుసని, కచ్చితంగా వికెట్లు తీసి మళ్లీ ఆకట్టుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, అక్కడ మేటి బౌలర్లు సైతం వికెట్లు తీయలేరనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పాడు. ఇక తన బ్యాటింగ్ విషయంలో డాట్‌బాల్స్ ఆడటం తక్కువ చేసుకోవాలనుకుంటున్నట్లు రాహుల్ పేర్కొన్నాడు.