
తాజా వార్తలు
చాహల్‌ను తీసుకోవాలనే ఆలోచనే లేదు
కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో చాహల్‌ను తీసుకోవాలనే ఆలోచనే లేదని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కంగారూ జట్టు 150/7కే పరిమితమైంది. చాహల్ 3/25, నటరాజన్ 3/30 అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో తొలుత చాహల్ తుది జట్టులో లేడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజా(44నాటౌట్; 23 బంతుల్లో 5x4, 1x6)కు చివరి ఓవర్లో తలకు గాయమవడంతో అతడు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసిన చాహల్.. ఫించ్(35), స్మిత్(12), మాథ్యూవేడ్(7) లాంటి కీలక బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. చాహల్‌ను తొలుత తీసుకోవాలనే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు.
‘యూజీని ఈ ఆటలో తీసుకోవాలనే ఆలోచనలే లేవు. కంకషన్ సబ్‌స్టిట్యూట్ అనేది విచిత్రమైన పరిస్థితి. ఈరోజు అది మాకు కలిసివచ్చింది. ఆసీస్‌ను చిత్తు చేయడంలో చాహల్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అయితే, ఫించ్, షార్ట్ బాగా ఆడడంతో వాళ్లకి శుభారంభం దక్కిందని అనుకున్నా. అలాగే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ కొన్ని వికెట్లు సమర్పించుకున్నారు. ఇక్కడ ఆడాలంటే చివరి వరకు పోరాడి ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి. ఇక నటరాజన్ మరింత మెరుగయ్యేలా కనిపిస్తున్నాడు. చాహర్ కూడా మంచి బౌలింగ్ చేశాడు. చాహల్ మమ్మల్ని తిరిగి మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. చివరగా హార్దిక్ పట్టిన క్యాచే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది’ అని కోహ్లీ వివరించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51), రవీంద్ర జడేజా(44) మెరుపు బ్యాటింగ్ చేశారు.