అతడే భవిష్యత్తు నాయకుడు!

తాజా వార్తలు

Published : 21/09/2020 01:06 IST

అతడే భవిష్యత్తు నాయకుడు!

దిల్లీ: కేఎల్ రాహుల్‌ భవిష్యత్తులో టీమ్‌ ఇండియా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీలు అంటున్న విషయం తెలిసిందే. అలా పేర్కొంటున్న వారి జాబితాలో తాజాగా సునీల్‌ గావస్కర్ సైతం చేరిపోయారు.  భారత క్రికెట్ జట్టుకు భవిష్యత్తులో కేఎల్ రాహుల్‌ నాయకుడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ‘బాధ్యతగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు భారీ స్కోర్లు చేయగలను అని నిరుపించుకోవడానికి కేఎల్‌కు గొప్ప అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే తనకు నాయకుడి లక్షణాలు ఉన్నాయని అతడు నిరూపించుకోగలడు. జట్టును ఎలా మలచుకోవాలి, ఎలాంటి నైపుణ్యం ప్రదర్శించాలన్న విషయంలో రాణించగలిగితే త్వరలోనే భారత జట్టుకు వైస్ కెప్టెన్‌ అవుతాడు. మన జట్టులో  రోహిత్‌, కోహ్లీ, రహానే లాంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. అయితే భవిష్యత్‌ కెప్టెన్‌ ఎవరనే విషయంలో రాహుల్ సైతం సెలక్షన్‌ కమిటీకి ఓ ఛాయిస్‌ కాగలడు. అందువల్ల ప్రస్తుత టోర్నీ అతడికి గొప్ప అవకాశం’’అని గావస్కర్‌ వివరించారు.  టీ20 లీగ్‌లో కేఎల్ పంజాబ్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్ చోప్రా సైతం కోహ్లీ వారసుడిగా రాహుల్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే అందుకు తాను తగిన వాడినేనని రాహుల్‌ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ‘‘అతడే తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించగలడని నేను అనుకుంటున్నాను.  కోహ్లీ, రోహిత్‌లు దాదాపు ఒకే వయసు వారు. అందువల్ల ఏదో ఒక సందర్భంలో నాయకుడు ఎవరనే సందేహం కలుగుతుంది.  ధోనీ తరువాత కోహ్లీ వచ్చాడు. కోహ్లీ తరువాత ఎవరో ఒకరు వస్తారు.  అది కేఎలే అయ్యే అవకాశం ఉంది’’అని  చోప్రా ఓ వీడియోలో తన అభిప్రాయం తెలిపాడు.

ధోనీ సారథిగా ఉన్న సమయంలో భారత భవిష్యత్తు కెప్టెన్‌  కోహ్లీనే అని చాలా స్పష్టంగా  తెలిసింది.  విరాట్‌ సైతం తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడి వయసు 30 దాటింది. దాంతో మరోసారి భవిష్యత్తు భారత కెప్టెన్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. వైస్‌ కెప్టెన్‌గా  ఉన్న రోహిత్ శర్మ వయసు కూడా 30కి పైగా ఉండటంతో మాజీలు కేఎల్‌పై అంచనాలను పెంచుతున్నారు. మరి వారి అంచనా సరైనదేనా! కాదా! తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని