close

తాజా వార్తలు

Updated : 29/09/2020 18:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏ జట్టు హై స్కోర్‌ ఎంతో తెలుసా?

కొడితే 220 దాటాల్సిందే..

పొట్టి క్రికెట్‌కు మరోపేరు ‘పరుగుల పండుగ’. ఎందుకంటే క్రీజులోకి వచ్చిన మరుక్షణం నుంచే బ్యాటర్లు విజృంభించేస్తారు. కళ్లు చెదిరే సిక్సర్లు.. కమనీయమైన బౌండరీలతో అలరిస్తారు. పవర్‌ప్లేలోనే 70-80 పరుగులు ఖాతాలో జమ చేసేస్తారు. ఆట పూర్తయ్యే వరకూ అదే జోరు కొనసాగిస్తే స్కోరు 220 దాటడం ఖాయమే. లీగ్‌లో అన్ని జట్లూ ఈ మైలురాయిని అందుకున్నాయి. మరికొన్ని గంటల్లో 2020 సీజన్‌ మొదలవుతోంది. మరి ఏ జట్టు అత్యధిక స్కోరు ఎంతో తెలుసుకుందామా!


263/5 @ బెంగళూరు

లీగ్‌లో భారీ స్కోర్లంటే గుర్తొచ్చేది బెంగళూరు. లీగ్‌లోనే అత్యధిక స్కోరైన 263/5 సాధించిన ఆ జట్టు 220 ఘనతను ఐదుసార్లు అందుకుంది. విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌కు తోడుగా ఒకప్పుడు క్రిస్‌గేల్‌, కేఎల్‌ రాహుల్‌, వాట్సన్‌ వంటి ఆటగాళ్లు ఉండేవారు. 2013లో పుణెపై లీగ్‌లోనే అత్యధిక స్కోరు చేసింది. ఆ పోరులో గేల్‌ (175*; 66 బంతుల్లో 13×4, 17×6) విధ్వంసాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఆ ఇన్నింగ్స్‌ చూస్తే ‘యూనివర్స్‌ బాస్‌’ అని పేరు పెట్టుకోవడంలో తప్పే లేదనిపిస్తుంది. బౌండరీల ద్వారానే 154 పరుగులు చేశాడంటే అతడి ఊచకోతను మనం అర్థం చేసుకోవచ్చు. ఛేదనలో పుణె 133/9కే పరిమితమైంది.


246/5 @ చెన్నై, 223/5 @ రాజస్థాన్‌

ఇప్పుడంతా 35+ కనిపిస్తున్నారు కానీ ఒకప్పుడు చెన్నై బ్యాటింగ్‌ లైనప్‌ అంటే దడే! ఒకరు కాకపోతే మరొకరు విధ్వంసాలు సృష్టించేవారు. మురళీ విజయ్‌, మాథ్యూ హెడేన్‌, సురేశ్‌ రైనా, ఎంఎస్‌ ధోనీ ఆ ఫ్రాంచైజీకి తురుపు ముక్కలు. 2010లో రాజస్థాన్‌పై సీఎస్‌కే అత్యధిక స్కోరు నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసి 246/5తో నిలిచింది. మురళీ విజయ్‌ (127; 56 బంతుల్లో 8×4, 11×6) సిక్సర్ల పిడుగులు కురిపించాడు. అతడికితోడుగా ఆల్బీ మోర్కెల్‌ (62; 34 బంతుల్లో 3×4, 5×6) దంచికొట్టడంతో ఈ స్కోరు సాధ్యమైంది. నమన్‌ ఓజా (94*; 55 బంతుల్లో 8×4, 6×6), షేన్‌ వాట్సన్‌ (60; 25 బంతుల్లో 5×4, 5×6) దంచికొట్టడంతో రాజస్థాన్‌ ఈ స్కోరు దాదాపుగా ఛేదించినంత పనిచేసింది. 223/5 వద్ద ఆగిపోయింది. అయితే రాజస్థాన్‌కు సైతం ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఛేదనలో అత్యధిక పరుగులు చేసింది ఆ జట్టే.


245/5 @ కోల్‌కతా

రెండు సార్లు విజేతగా ఆవిర్భవించిన కోల్‌కతా సైతం భారీ స్కోర్లు చేయడంలో తక్కువేమీ కాదు. 2018లో పంజాబ్‌పై 245/6 పరుగులు చేసింది. ఈ పోరులో ఆ జట్టు టాప్‌, మిడిలార్డర్‌ దూకుడుగా ఆడటం విశేషం. సునీల్‌ నరైన్‌ (75; 36 బంతుల్లో 9×4, 4×6), దినేశ్‌ కార్తీక్‌ (50; 23 బంతుల్లో 5×4, 3×6) భారీ అర్ధశతకాలకు తోడు క్రిస్‌ లిన్‌ (27; 17 బంతుల్లో), రాబిన్‌ ఉతప్ప (24; 17 బంతుల్లో), ఆండ్రి రసెల్‌ (31; 14 బంతుల్లో), శుభ్‌మన్‌ (16; 8 బంతుల్లో) దంచికొట్టారు. అయితే కేఎల్‌ రాహుల్‌ (66; 29 బంతుల్లో 2×4, 7×6), అశ్విన్‌ (45; 22 బంతుల్లో 4×4, 3×6)కు తోడుగా మిగతా ఆటగాళ్లు రాణించడంతో పంజాబ్‌ 214/8 పరుగులు చేయడం గమనార్హం.


232/2 @  పంజాబ్‌

2011 సీజన్‌లో పంజాబ్‌ తన అత్యధిక స్కోరు నమోదు చేసింది. బెంగళూరుపై  232/2 కొట్టింది. ఆసీస్‌ విధ్వంసకర వీరుడు గిల్‌క్రిస్ట్‌ (106; 55 బంతుల్లో 8×4 9×6) శతకంతో విరుచుకుపడ్డాడు. అతడితో తోడుగా షాన్‌ మార్ష్‌ (79*; 49 బంతుల్లో 7×4, 5×6) కళ్లు చెదిరే సిక్సర్లతో మెరిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 206 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఎడాపెడా సిక్సర్లు, బౌండరీలతో ఊచకోత కోశారు. ఛేదనలో బెంగళూరు 121 పరుగులకే కుప్పకూలడం గమనార్హం.


231/4 @ దిల్లీ

ఇప్పటి వరకు ట్రోఫీ గెలవలేదు గానీ తనదైన రోజున పరుగుల వరద పారించగలదు దిల్లీ. 2011లో పంజాబ్‌పై అత్యధిక స్కోరు నమోదు చేసింది. 4 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (77; 48 బంతుల్లో 7×4, 4×6), వీరేంద్ర సెహ్వాగ్‌ (77; 35 బంతుల్లో 8×4, 4×6) దుమ్మురేపారు. తొలి వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ బాదిన షాట్లకు మైదానం హోరెత్తింది. తెలుగు క్రికెటర్‌ వేణుగోపాల్‌ రావు (28*; 15 బంతుల్లో 3×4, 1×6) సైతం రాణించాడు. ఛేదనలో షాన్‌మార్ష్‌ (95; 46 బంతుల్లో 9×4, 6×6), గిల్లీ (42; 33 బంతుల్లో 8×4, 1×6) ఎడాపెడా బాదేయడంతో పంజాబ్‌ 202/6 పరుగులు చేసింది.


231/2 @ హైదరాబాద్‌

విధ్వంసకర టాప్‌ ఆర్డర్‌తో నిండిన జట్టు హైదరాబాద్‌. 2019లో బెంగళూరుపై తన అత్యధిక స్కోరు 231/2తో నిలిచింది. ఈ పోరులో ఓపెనర్లు జానీ బెయిర్‌ స్టో (114; 56 బంతుల్లో 12×4, 7×6), డేవిడ్‌ వార్నర్‌ (100*; 55 బంతుల్లో 5×4, 5×6) శతకాలతో కదం తొక్కారు. వీరిద్దరి ధాటికి బెంగళూరు బౌలర్లు బిత్తరపోయారు. వారినెలా అడ్డుకోవాలో తెలియక ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా బెయిర్‌స్టో కొట్టిన షాట్లకు హైదరాబాదీలు ఫిదా అయ్యారు. ఛేదనలో బెంగళూరు 113 పరుగులకే కుప్పకూలింది.


230/3 @ ముంబయి

రాజస్థాన్‌ తరహాలోనే ఛేదనలోనే భారీ స్కోరు చేసింది ముంబయి. అయినా ఓటమి పాలైందీ విజేతల జట్టు. 2017లో వాంఖడే వేదికగా ముంబయి, పంజాబ్‌ తలపడ్డాయి. వృద్ధిమాన్‌ సాహా (93*; 55 బంతుల్లో 11×4, 3×6), మాక్స్‌వెల్‌ (47; 21 బంతుల్లో 2×4, 5×6) విజృంభించడంతో పంజాబ్‌ 230/3 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన ముంబయి సైతం ధాటిగానే ఆడింది. సిమన్స్‌ (59; 32 బంతుల్లో 5×4, 4×6), పార్థివ్‌ పటేల్‌ (38; 23 బంతుల్లో 7×4), కీరన్‌ పొలార్డ్‌ (50*; 24 బంతుల్లో 1×4, 5×6), హార్దిక్‌ పాండ్య (30; 13 బంతుల్లో 4×6) దూకుడుగా ఆడటంతో 223/6తో నిలిచింది. విజయానికి మరో 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.