close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/06/2020 03:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంటే..ధోనీయే కారణమా ఇర్ఫాన్‌?

ఆనాటి పరిస్థితులను వివరించిన పఠాన్‌

ముంబయి: ఇర్ఫాన్‌ పఠాన్‌. భారత క్రికెట్లో సంచలనాలు సృష్టించిన ఎడమచేతి వాటం పేసర్‌. అద్భుతమైన స్వింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్‌పై టెస్టులో తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌ తీసి ఔరా అనిపించుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ తర్వాత జట్టులో అతడికి చోటు ప్రశ్నార్థకంగా మారింది. అతడు మునుపటిలా బంతిని స్వింగ్‌ చేయడం లేదని, బౌలింగ్‌లో వేగం లేదని విమర్శలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్‌ సిరీస్‌లో బెంచీకే పరిమితం చేశారు. అసలు ఏం జరిగింది? తన ప్రదర్శనలో లోపం గురించి కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని అతడు ఏమని ప్రశ్నించాడంటే..?

‘జట్టులోంచి నన్ను తొలగించినప్పుడు చివరి వన్డే, టీ20ల్లో  నాకు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులు వచ్చాయి. శస్త్రచికిత్స చేయించుకున్న వృద్ధిమాన్‌ సాహా ఏడాది తర్వాత జట్టులోకి వచ్చాడు. ఈ లోపు రిషభ్‌ పంత్‌ రెండు శతకాలు బాదేశాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐనా సరే సాహాకు అవకాశం ఇచ్చారు. కొందరికి అండ దొరుకుతుంది. కొందరికి దొరకదు. కొందరు అదృష్టవంతులు. కొందరు కాదు. నేను దురదృష్టవంతుల జాబితాలో ఉన్నాను’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు.

‘పఠాన్‌ బంతిని స్వింగ్‌ చేయడం లేదని చాలామంది విమర్శించాలి. ఆ పరిస్థితులను జట్టు మార్చాల్సింది. కానీ అలా చేయలేదు. 10-15 ఓవర్ల తర్వాత బంతి ఇస్తే స్వింగ్‌ చేయలేం. నా పాత్రను మార్చారు. దాడి చేసే బౌలర్‌కు కెప్టెన్‌ బంతినిచ్చి పరుగులు నియంత్రించమంటే ఏం చేస్తారు? ఎక్కువ వైవిధ్యం చూపించాల్సి వస్తుంది. కట్టర్లు వేయాల్సి ఉంటుంది. మరి ఎక్కువ కట్టర్లు వేస్తే బౌలింగ్‌ మారుతుంది కదా. సాధన చేసేటప్పుడూ అవే బంతులు వేయాలి. నా పాత్రను మార్చారు సరే ప్రోత్సాహం అందించాలి కదా. అదే జరగలేదు’ అని పఠాన్‌ వాపోయాడు.

‘శ్రీలంకతో టీ20 సిరీస్‌ తర్వాత టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ వెళ్లింది. ఐదు వన్డేల సిరీస్‌లో 3-0తో ముందంజలో నిలిచింది. నేను ఒక్కదాంట్లోనూ ఆడలేదు. ఒక మ్యాచ్‌ వర్షార్పణం అయింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా అవకాశం ఇవ్వలేదు. నా ఆటను మెరుగుపర్చుకొనేందుకు ఏం చేయాలని అప్పుడు నేను కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ను అడిగాను. నేను బ్యాటింగ్‌, బౌలింగ్‌ బాగా చేస్తున్నానని ఆయన చెప్పాడు. కానీ కొన్ని అంశాలు తన చేతిలోనూ ఉండవన్నాడు’ అని పఠాన్‌ తెలిపాడు.

‘2008 ఆస్ట్రేలియా పర్యటనలో నేను మహీ భాయ్‌ను అడిగాను. నేను బాగా బౌలింగ్‌ చేయడం లేదని మీడియాలో మహీ భాయ్‌ ప్రకటన వచ్చింది. నిజానికి సిరీస్‌ సాంతం నేను బాగానే బౌలింగ్‌ చేశాను. సాధారణంగా మీడియాలో ద్వంద్వార్థాలతో వార్తలు వస్తాయి. అందుకే మహీని దానిపై వివరణ కోరాను. అలా చెప్పలేదని, అంతా ప్రణాళిక ప్రకారమే సాగుతోందని అతడు చెప్పాడు. అలాగంటే  అంతా బాగుందనేగా నమ్ముతాం. ప్రతిసారీ వెళ్లి వివరణ అడగలేం కదా. పదేపదే అలా చేస్తే ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. ఊరికే ఇంకొకరి గదికి వెళ్లి ఏదో ఒకటి చెబుతూ ఉండటం నా పని కాదు. క్రికెటర్‌ మైదానంలోకి వెళ్లాలి. ఆడాలి. ఆటపైనే దృష్టిపెట్టాలి. బాగా ఆడుతుంటే ప్రోత్సహించాలి. అలా లేదంటే ఆటగాడు ఎంత గొప్పవాడైనా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది’ అని పఠాన్ ముగించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.