close
Array ( ) 1

తాజా వార్తలు

టీమ్‌ఇండియాకు వెస్టిండీస్‌ మిగిల్చిన వేదన

సచిన్‌ తెందూల్కర్‌కు ప్రత్యేకమైన రోజు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రీడా ఈవెంట్లన్నీ నిలిచిపోయిన సందర్భంలో గతస్మృతులను నెమరువేసుకుంటే టీమ్‌ఇండియాకు ఈ రోజుకు సంబంధించి రెండు ప్రత్యేక విశేషాలున్నాయి. సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్లో ఓటమిపాలై మనోవేదనకు గురైంది. వెస్టిండీస్‌తో అద్భుతంగా తలపడినా భారత్‌ ఆ మ్యాచ్‌లో అనూహ్య రీతిలో ఓటమిపాలైంది. ఇక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ 2001లో ఈ రోజు ప్రత్యేక రికార్డు నెలకొల్పడం విశేషం.


కోహ్లీ దంచికొట్టిన వేళ..

2016 టీ20 ప్రపంచకప్‌ స్వదేశంలో జరగడంతో టీమ్‌ఇండియా కచ్చితంగా రెండోసారి ఈ ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలుస్తుందని అంతా భావించారు. లీగ్‌ స్టేజ్‌లో అదరగొట్టిన ధోనీసేన సెమీస్‌లో విండీస్‌తో అద్భుతంగా తలపడినా చివరి క్షణాల్లో బోల్తాకొట్టింది. విరాట్‌కోహ్లీ(89; 47 బంతుల్లో 11x4, 1x6) మెరుపు బ్యాటింగ్‌కు.. రోహిత్‌శర్మ (43), అజింక్య రహానె(40) శుభారంభం దక్కడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రోహిత్‌, రహానె తొలి వికెట్‌కు 7.2 ఓవర్లలోనే 62 పరుగులు జోడించారు. రోహిత్ ఔటయ్యాక.. రహానెతో జోడీకట్టిన విరాట్‌ రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 128 పరుగుల వద్ద రహానె ఔటయ్యాక.. కోహ్లీ, నాటి కెప్టెన్‌ ధోనీ(15)తో కలిసి భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. 


భారత్‌ గెలుస్తుందనుకుంటే.. విండీస్‌ గెలుపు

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రమాదకర క్రిస్‌గేల్‌(5), సామ్యూల్స్‌(8) తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్‌ చేరడంతో టీమ్‌ఇండియా విజయం ఖాయమనుకున్నారు. తర్వాత జాన్సన్‌ (52), లెండిల్‌ సిమ్మన్స్‌(82) నిలకడగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. 116 పరుగుల వద్ద జాన్సన్‌ ఔటవ్వడంతో.. విండీస్‌ విజయానికి 6 ఓవర్లలో 73 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన ఆండ్రూ రసెల్‌(43; 20 బంతుల్లో 3x4, 4x6) విధ్వంసకరంగా బ్యాటింగ్‌ చేసి విండీస్‌ను గెలిపించాడు. తర్వాత ఆ జట్టు ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌ సాధించింది. 


ఆ రికార్డు సాధించిన తొలి క్రికెటర్‌ సచిన్‌

మరోవైపు 2001 మార్చి 31న క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ వన్డేల్లో అరుదైన రికార్డు సాధించిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో పదివేల పరుగుల మైలురాయి చేరుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో లిటిల్‌ మాస్టర్‌ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత వన్డేల్లో 13 మంది ఈ ఘనత సాధించారు. కాగా, టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(205 ఇన్నింగ్స్‌లో) 2018 అక్టోబర్‌ 24న అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించి సచిన్‌ (259 ఇన్నింగ్స్‌) రికార్డును అధిగమించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.