close

తాజా వార్తలు

Published : 01/12/2020 23:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వార్నర్‌ తొలి టెస్టుకూ  అనుమానమే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టీమ్‌ఇండియాతో తొలి టెస్టు ఆడటం కూడా అనుమానమేనని ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ పేర్కొన్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో వార్నర్‌ ఫీల్డింగ్‌ చేస్తూ మైదానంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడికి తొడ కండరాల్లో గాయం కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా తీవ్రత ఎక్కువని తెలిసింది. వైద్యుల సూచన మేరకు తగినంత విశ్రాంతి అవసరమని, దాంతో మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్‌లో ఆడలేడని లాంగర్‌ తొలుత మీడియాకు వెల్లడించాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు మరో ఛానల్‌తో మాట్లాడుతూ.. డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు కూడా అందుబాటులో ఉండడం అనుమానంగా ఉందని చెప్పాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది.

‘వార్నర్‌ తొలి టెస్టు ఆడతాడనే విషయంలో నేనేమీ దాచిపెట్టట్లేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉంది. నొప్పి కూడా అధికంగా ఉంది. మేం ఇప్పుడు కాన్‌బెర్రాకు చేరుకున్నాం. తిరిగి సిడ్నీకి చేరుకునేంత వరకు అతడిని చూడకపోవచ్చు. అయితే, వార్నర్‌ ఒక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ కాబట్టి కచ్చితంగా తొలి టెస్టుకు ముందే పూర్తిగా కోలుకోవడానికి ప్రయత్నిస్తాడనే నమ్మకం ఉంది’ అని లాంగర్‌ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, వార్నర్‌ తొలి రెండు వన్డేల్లో అర్ధశతకాలతో రాణించిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌ల్లోనూ అతడు కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌తో కలిసి శతక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దాంతో టీమ్‌ఇండియాపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించడానికి తన వంతు పాత్ర పోషించాడు. ఇక బుధవారం జరిగే మూడో వన్డేలో వార్నర్‌ ఆడకపోవడం టీమ్‌ఇండియాకు కాస్త ఊరటనిచ్చే విషయం. మరి ఇప్పుడైనా కోహ్లీసేన విజయంతో సిరీస్‌ను ముగిస్తుందా లేదా వేచి చూడాలి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన