close

తాజా వార్తలు

‘300’ మిస్‌!

జట్టు కోసం వ్యక్తిగత రికార్డులు వదులుకున్న క్రికెటర్లు

రికార్డులున్నవి బద్దలు కొట్టేందుకే. ఘనతలున్నవి తిరగరాసేందుకే. ఐతే వ్యక్తిగత మైలురాళ్ల కన్నా జట్టు ప్రయోజనాలు అత్యంత ముఖ్యం. త్రిశతకం సాధించిన డేవిడ్‌ వార్నర్‌ రికార్డును అడ్డుకోవడమూ అలాంటిదే. వాస్తవానికి మ్యాచుకు సిసలైన గమ్యం గెలుపే. అడిలైడ్‌ వేదికగా పాక్‌తో జరిగిన డే/నైట్‌ మ్యాచులో ఇన్నింగ్స్‌ డిక్లరేషన్‌ నిర్ణయం ఆ కోవలోకే వస్తుంది. గతంలోనూ జట్టు కోసం వ్యక్తిగత ఘనతలు వదులుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి.


వార్నర్‌ ఛాన్స్‌ మిస్‌

పాక్‌తో మ్యాచ్‌ తొలిరోజు వర్షం కురిసింది. ఒకటిన్నర సెషన్‌ ఆటే సాధ్యమైంది. జోరుమీదున్న డేవిడ్‌ వార్నర్‌ (335*) త్రిశతకం సాధించాడు. బ్రాడ్‌మన్‌ రికార్డు బద్దలవ్వగానే 589/3 వద్ద పైన్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. చాలామంది డిక్లరేషన్‌ను వ్యతిరేకించారు. డేవీ కచ్చితంగా లారా (400) రికార్డు బద్దలు కొట్టేవాడన్నారు. డిక్లేర్‌ చేసేందుకు పైన్‌కు రెండు కారణాలు ఉన్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తర్వాత జట్టు విజయమే పరమావధిగా మారింది. ఇప్పటికే టీమిండియా 7 మ్యాచుల్లో 360 పాయింట్లకు పోటీపడి అన్నీ సాధించింది. రెండో స్థానంలో ఉన్నప్పటికీ కంగారూలకు మనకు అంతరం చాలా ఉంది. ప్రస్తుతం గెలవడమే ముఖ్యంగా జట్లన్నీ సాగుతున్నాయి. మరోవైపు వర్షసూచన ఉండటంతో తగిన సమయం లేకుంటే పాక్‌ను రెండుసార్లు ఆడించడం కష్టం. డేవీ సైతం అలసిపోయాడు.


వీవీఎస్‌ కన్నా ముందు పీటర్‌ మే

చరిత్రలోనే అత్యంత గొప్ప క్రికెట్‌ మ్యాచ్‌ ఏదంటే వచ్చే జవాబు భారత్‌×ఆసీస్‌ టెస్టు అనే. ఇలాంటి పోరే 1957లో ఇంగ్లాండ్‌, విండీస్‌ మధ్య జరిగింది. టీమిండియాకు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎలా వెన్నెముకగా నిలిచాడో ఇంగ్లాండ్‌కు పీటర్‌ మే (285*) అలాగ. తొలి ఇన్నింగ్స్‌లో పీటర్‌ సారథ్యంలోని ఇంగ్లాండ్‌ 186కే కుప్పకూలింది. విండీస్‌ 474కు ఆలౌటైంది. 288 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు ఆడిన ఇంగ్లాండ్‌కు పీటర్‌ మే (285*), మెక్‌ కౌడెరీ (154) ప్రాణం పోశారు. 600 బంతులాడిన పీటర్‌ మరో 15 పరుగులు చేస్తే త్రిశతకం అందుకునేవాడు.  జట్టు ప్రయోజనాలకే విలువిచ్చిన అతడు ఐదో రోజు ఉదయం 583/4 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. ఆట ముగిసే సరికి విండీస్‌ను ఇంగ్లాండ్‌ 72/7కు పరిమితం చేయడం గమనార్హం.


పాపం! డరైల్‌ కలినన్‌

1990ల్లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ వెన్నెముక డరైల్‌ కలినన్‌ (275*). అన్నీ కుదిరితే సఫారీల తరఫున తొలి త్రిశతక వీరుడిగా అవతరించేవాడు. న్యూజిలాండ్‌తో పోరులో గ్రేమ్‌ పొలాక్‌ అత్యధిక పరుగుల రికార్డు బద్దలు చేయగానే కెప్టెన్‌ క్రో మూడోరోజు ఉదయం ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. ఎందుకంటే అప్పటికే దక్షిణాఫ్రికా 200కు పైగా ఓవర్లు ఆడింది. అప్పుడు ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయకుంటే ఆట ముందుకు సాగడం కష్టం. చాలామంది కలినన్‌కు అవకాశం ఇస్తే బాగుండేది అనుకున్నారు.


మిస్టర్‌ ‘360’కి దక్కని 300

ఒక త్రిశతక వీరుడిని చూసేందుకు దక్షిణాఫ్రికా హషీమ్‌ ఆమ్లా (311) వరకు ఎదురుచూసింది. కానీ అంతకన్నా ముందే మిస్టర్‌ 360 డిగ్రీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ (278*) ఆ ఘనత అందుకునేవాడు. పాక్‌తో టెస్టులో అతడు త్రిశతకానికి దాదాపు చేరువయ్యాడు. ఇక లాంఛనమే అనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా కెప్టెన్‌ గ్రేమ్‌స్మిత్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి ఏబీ ఆశల్ని భగ్నం చేశాడు. ఐతే కెప్టెన్‌ ఆలోచనల్లోనూ స్పష్టత ఉంది. అప్పటికే ఏబీ 11వ బ్యాట్స్‌మన్‌తో కలిసి ఆడుతున్నాడు. అలాంటప్పుడు త్రిశతకం కష్టమని స్మిత్‌ భావించాడు. అంతిమంగా జట్టు ప్రయోజనాలే ముఖ్యంగా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసేశాడు.


మియాందాద్‌కు సెగ

టీమిండియా అంటే చెలరేగిపోయే ఆటగాళ్లలో జావెద్‌ మియాందాద్‌ (280*) ఒకరు. అతడో ప్రపంచస్థాయి ఆటగాడు. ఓపెనర్‌ ముదాసర్‌ నజర్‌కు జతకలిసిన మియాందాద్‌ ఏకంగా 451 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. నజర్‌ 231 వద్ద ఔటైనా అతడు ఆగలేదు. త్రిశతకం వైపు వేగంగా పరుగులు తీశాడు. ఆశ్చర్యకరంగా రెండో రోజు సాయంత్రం ఇమ్రాన్‌ ఖాన్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి అతడి త్రిశతకాన్ని అడ్డుకున్నాడు. ఆ నిర్ణయం సరైనదే అయినా మరికొన్ని ఓవర్లు ఆడిస్తే బాగుండేదని అందరికీ అనిపించింది. అప్పటికే ఆధిపత్య పోరు నడుస్తున్న ఇమ్రాన్‌, మియాందాద్‌ మధ్య ఇది మరికొంత ఆజ్యం పోసింది.


సిసలైన సారథి ఫ్లెమింగ్‌

న్యూజిలాండ్‌ గర్వించదగ్గ సారథి స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌. అద్భుత నాయకత్వ లక్షణాలు అతడి సొంతం. జట్టు కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పట్టించుకొనే రకం కాదు. శ్రీలంకతో జరిగిన టెస్టులో అతడు 274 పరుగులతో అజేయంగా ఉన్నప్పుడే ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. సొంత రికార్డును పట్టించుకోలేదు. అప్పటికే కివీస్‌ రెండు రోజుల్లో 175కు పైగా ఓవర్లు ఆడింది. మరో 26 పరుగులు చేస్తే త్రిశతకం చేసిన కివీస్‌ మొదటి ఆటగాడిగా ఫ్లెమింగ్‌ రికార్డులు సృష్టించేవాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.