close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వేటిపై దాడి జరిగినా జగన్‌దే బాధ్యత

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

రాష్ట్రంలో ఏ ఆలయంపైన, ఏ బడిపైన దాడి జరిగినా.. వాటికి కర్త, కర్మ, క్రియ జగనే అవుతారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చేతగానితనాన్ని, అసమర్థతను బయట పెట్టుకోలేక జగన్‌ రాష్ట్రంలో జరుగుతున్న దాడుల పాపాన్ని ఇతర పార్టీలపైకి నెట్టేందుకు చూస్తున్నారని మంగళవారం ఒక వీడియో సందేశంలో మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు దేవాలయాలను ధ్వంసం చేసి పరిశీలనకు వెళ్తున్నాయన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రేపు బడుల మీద దాడులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఆయన నీతులు చెబుతున్నారు. అంటే మీ తర్వాత లక్ష్యం బడులపై పెట్టుకుని ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తారనే అనుమానం కలుగుతోంది. మీ కనుసన్నల్లో దేవాలయాలపై దాడులు జరిగినందునే వాటిని సందర్శించలేదు. ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వస్తుందా? మీ పుట్టినరోజు వేడుకలు చేస్తే రాదా? మద్యం అమ్మకాలతో జనాలను దోచుకుంటే కరోనా రాదా?’ అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో ఎన్టీఆర్‌, ఎర్రంన్నాయుడు విగ్రహాల ధ్వంసం ఘటనపై అచ్చెన్నాయుడు స్పందించారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కుల, మత రాజకీయాలు, దేవుళ్లు, నేతల విగ్రహాలపై దాడులు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. తెదేపా హయాంలో ఇలాంటివి జరగలేదని, విగ్రహాలపై దాడి చేసిన సంఘటన బాధాకరమ’ని వ్యాఖ్యానించారు.

హిట్లర్‌ తరహా కుట్రలు: దేవినేని ఉమా
జర్మనీలో పార్లమెంటును తగులబెట్టించిన హిట్లర్‌ ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై, యూదులపై మోపి అమానుషాలకు పాల్పడ్డారు. ఇప్పుడు సీఎం జగన్‌ దేవాలయాలపై దాడులు చేయిస్తూ ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తున్నారు. అందుకే వైకాపా హయాంలో ఇప్పటి వరకు దేవాలయాలపై జరిగిన దాడులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.  

దాడులు చేస్తున్నదెవరో సీఎంకు తెలుసు: వర్ల రామయ్య  
దేవాలయాలపై దాడులు చేస్తున్నవారే తిరిగి వాటిని సందర్శిస్తున్నారని నెల్లూరు సభలో ముఖ్యమంత్రి అన్నారు. అంటే హిందూ మతంపై ఎవరు దాడి చేస్తున్నారో, ఎవరు రథాలను తగులబెట్టారో ఆయనకు తెలుసని స్పష్టమవుతోంది. డీజీపీ వెంటనే ముఖ్యమంత్రి జగన్‌కు నోటీసులిచ్చి ఆయన నుంచి సమాచారం రాబట్టాలి. జగన్‌, ఆయన కుటుంబం తమ స్వార్థం కోసం క్రైస్తవ మతాన్ని రోడ్డున పడేశారన్న చంద్రబాబు వ్యాఖ్యల్లో తప్పేముంది? పేద పాస్టర్లకు అందాల్సిన రూ.5వేల భృతిని జగన్‌ తనకు అనుకూలంగా పనిచేసే వ్యక్తులకు ఇవ్వడాన్నే చంద్రబాబు తప్పుబట్టారు. క్రైస్తవ మతపెద్దలు సీఎం మాయలో పడొద్దు.  

ఓడిపోతామనే భయంతోనే పలాయనం: కాలవ శ్రీనివాసులు
రాష్ట్ర ఎన్నికల కమిషనరు రమేశ్‌ కుమార్‌ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారనే ఉద్దేశంతోనే వైకాపా.. కరోనా పేరుతో వాయిదా కోరుతోంది. కరోనా ఎక్కువగా ఉన్నప్పుడే ప్రజా ప్రస్థానం వార్షికోత్సవ పాదయాత్రలు నిర్వహించారు. 2014లో 346 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా.. 2020లో 2,362 ఏకగ్రీవం చేసుకున్నారు. జడ్పీటీసీలకు సంబంధించి అప్పట్లో ఒక జడ్పీటీసీ ఏకగ్రీవమైతే.. ఇప్పడు 126 ఏకగ్రీవమయ్యాయి. దీనిని బట్టి బెదిరింపులు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 553 ఎంపీటీసీలకు 439, 50 జడ్పీటీసీ స్థానాలకు 38 ఏకగ్రీవం చేసుకున్నారు.  

ముందే సంక్రాంతి తెచ్చామనడం సిగ్గుచేటు: తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
రైతులకు పంటనష్ట పరిహారం సొమ్ము, పంటల బీమా సొమ్ము, ధాన్యం కొనుగోళ్ల బకాయిలు చెల్లించని ప్రభుత్వం.. రైతులకు ముందే సంక్రాంతి తీసుకొచ్చామని చెప్పడం సిగ్గుచేటు. తుపాన్లు, ప్రకృతి విపత్తుల కారణంగా రైతులు రూ.10వేల కోట్ల పంట ఉత్పత్తులు నష్టపోతే ప్రభుత్వం రూ.600 కోట్లు ఇచ్చి ఊరుకుంది. ఆ సొమ్మూ రైతులకు సక్రమంగా చేరలేదు. పంటనష్టం లెక్కింపు బాధ్యతను వాలాంటీర్లకు, రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి అప్పగించడంతో రైతులకు తీరని అన్యాయం జరిగింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు