close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాయలసీమ వాసై ఉండి ఆ ప్రాంతానికే ద్రోహం

 1000కి.మీకిపైగా ప్రయాణించి విశాఖకు ఎలా వెళ్తారు?
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాయలసీమవాసై ఉండి జగన్‌ ఆ ప్రాంతాన్నే మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాజధాని మార్పు అంశంలో ఆయన ఒకసారి అత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ‘‘రాయలసీమవాసులు విశాఖకు వెళ్లాలంటే వెయ్యి కిలోమీట్లరకు పైగా ప్రయాణం చేయాలి. సామాన్యులు, రైతులు అంత దూరం ప్రయాణించగలరా?’’ అని ప్రశ్నించారు. అమరావతి నగర నిర్మాణాన్ని పాతాళానికి తొక్కేస్తున్న జగన్‌ వింత చేష్టలు రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారాయని మండిపడ్డారు. ప్రజలంతా ఏకతాటిపై నడవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఆన్‌లైన్‌ సమావేశంలో విలేకర్లతో మాట్లాడారు. ‘‘అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని చెబుతున్న కొందరు ప్రభుత్వ పెద్దలు ఇప్పటికిప్పుడు అక్కడ అదనంగా చేయాల్సిన ఖర్చేమిటో చెప్పాలి. డీజీపీ కార్యాలయం, సచివాలయం, శాసనసభ వంటివన్నీ రూపాయి ఖర్చు లేకుండా నడుస్తుంటే ఎక్కడో విశాఖలో పాలనా రాజధాని నిర్మిస్తామనడం తుగ్లక్‌ చర్య కాక మరేమవుతుంది. విశాఖలో వేల మందికి ఉపాధి కల్పించడం కోసం నిర్మించిన కార్యాలయాలను లాక్కొని వాటిలో పాలన చేస్తామంటారా? జగన్‌ నిర్ణయం వల్ల ఒక అద్భుతమైన రాజధానిని కోల్పోవడంతో పాటు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే గనిని చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. ప్రైవేటు పెట్టుబడులకు కేంద్రబిందువైన అమరావతి నుంచి వైకాపా ప్రభుత్వం తరిమేసిన సింగపూర్‌ కన్సార్షియం వంటివి ఉండి ఉంటే రూ.50వేల కోట్ల పెట్టుబడులు వచ్చేవి...’’ అని పేర్కొన్నారు. ‘‘అమరావతే రాజధానిగా కొనసాగుతుందని అసెంబ్లీ సాక్షిగా జగన్‌ చెప్పారు. ఆయనతో పాటు ఎందరో వైకాపా నేతలు... జగన్‌ రాజధానిలో ఇల్లు కట్టుకున్నారు. అమరావతిలోనే ఉంటారు. ఆయన మాటంటే తప్పరు అని ఊదరగొట్టారు. ఇప్పుడు ఏ ప్రాతిపదికన పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేశారో వారు సమాధానం చెప్పాలి. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే హక్కు జగన్‌కు, వైకాపా నేతలకు ఎవరిచ్చారు? చంద్రబాబు సవాల్‌పై వైకాపా కీలక నేతలు ఎందుకు స్పందించడం లేదు. మూడు రాజధానుల అంశంపై ప్రజా తీర్పు కోరాల్సిన బాధ్యత వైకాపా ప్రభుత్వం పైనే ఉంది’’ అని కాలవ డిమాండ్‌ చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.