close

ప్రధానాంశాలు

పత్తి కొనుగోలుకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి

  2న పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద దీక్షలు
  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రైతు పత్తి సాగు చేయాలంటే.. అతని నుంచి పంటను క్వింటాలు 7 వేల రూపాయలకు కొంటామని ముందుగానే ప్రభుత్వం హామీ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నూతన వ్యవసాయ విధానం లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు. మొక్కజొన్న విత్తనాలు విక్రయించవద్దన్న కలెక్టర్లపై కోర్టుకు వెళ్తామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతారు.

ఎస్‌ఎల్‌బీసీ వద్ద నాతో పాటు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి... పాలేరు జలాశయం వద్ద భట్టి విక్రమార్క, సీతక్క, పొడెం వీరయ్య... లక్ష్మీదేవిపల్లి పంపు హౌస్‌వద్ద కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి... ఎల్లూరు జలాశయం వద్ద నాగం జనార్దన్‌రెడ్డి, కరివేన వద్ద చిన్నారెడ్డి... నెట్టెంపాడు వద్ద సంపత్‌కుమార్‌... కల్వకుర్తి వద్ద వంశీచంద్‌రెడ్డి పాల్గొంటారు. కృష్ణానదిపై ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? జూన్‌ 6న గోదావరి పెండింగ్‌ ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేస్తాం. రాష్ట్ర ఆర్థిక విధానాలపై ప్రధాని, ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేస్తాం. ప్రైవేటు యూనివర్సిటీలను అనుమతించడమంటే... తమ హయాంలో ఉన్నత విద్య విఫలమైందని కేసీఆర్‌ అంగీకరిస్తున్నారా? కబ్జాకు గురవుతున్న ఉస్మానియా యూనివర్సిటీ భూములను ఆదివారం సందర్శిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి 4 కమిటీలను నియమించాం. భట్టి నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాల కమిటీ... ఉస్మానియా భూములు, విద్యపై పొన్నం ప్రభాకర్‌... నూతన వ్యవసాయ విధానంపై చిన్నారెడ్డి, కోదండరెడ్డి... గోదావరి పెండింగ్‌ ప్రాజెక్టుల నిరసన దీక్షలకు జీవన్‌రెడ్డి నేతృత్వం వహించనున్నారు’’ అని ఉత్తమ్‌ తెలిపారు.

వలస కార్మికులను ఆదుకోవడంలో విఫలం
వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన బస్సులను పీసీసీ అధ్యక్షుడు ప్రారంభించారు. ‘‘వలస కార్మికులను ఆదుకోవడంతో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారు. నగదు బదిలీ, ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాష్ట్రంలో ప్రతి విషయంలో నిపుణుడిగా మాట్లాడే ముఖ్యమంత్రి వద్ద కార్మికులకు సంబంధించి సరైన లెక్కలు లేవు. ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు లేకపోవడంతో కాంగ్రెస్‌ తరఫున వారిని స్వస్థలాలకు పంపిస్తున్నాం’’ అని అన్నారు. వలస కార్మికుల వివరాలతో రూపాందించిన ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ఉత్తమ్‌ ప్రారంభించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌, రీఇంజినీరింగ్‌ పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. ఉస్మానియా వర్సిటీ భూములపై ఏడో నిజాం ఇచ్చిన ఫర్మానా ఆధారంగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థతో రీసర్వే చేయించాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సమావేశంలో పీసీసీ ఐటీ సెల్‌ ఇన్‌ఛార్జి మదన్‌ మోహన్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు..

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.