Karnataka Politics: ముఖ్యమంత్రి మార్పుపై నేడే నిర్ణయం?

తాజా వార్తలు

Published : 25/07/2021 14:51 IST

Karnataka Politics: ముఖ్యమంత్రి మార్పుపై నేడే నిర్ణయం?

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప త్వరలోనే రాజీనామా చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే భాజపా అధినాయకత్వం ఓ నిర్ణయం తీసుకుందని.. నేడు (ఆదివారం సాయంత్రం) సీఎం యడియూరప్పకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా హైకమాండ్‌ నుంచి ఆదేశాలు రాగానే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని యడియూరప్ప తాజాగా వెల్లడించారు.

‘పార్టీ అధిష్ఠానం నుంచి ఈ సాయంత్రంలోగా ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది. ఆ ప్రకటన రాగానే నేను కూడా సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తా’ అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి బాధ్యతల్ని దళిత వ్యక్తికి అందించబోతున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఆ నిర్ణయం నా చేతుల్లో లేదని.. కేవలం పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని చెప్పారు. సీఎంగా రెండేళ్లు పూర్తి చేసుకున్నందున యడియూరప్పకు సంఘీభావంగా ఆయన మద్దతుదారులు బెంగళూరులో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎం ఈ విధంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిగా కొనసాగింపుపై భాజపా అధిష్ఠానం నుంచి నేడు (ఆదివారం) ఆదేశాలు వస్తాయన్న వార్తల నేపథ్యంలో యడియూరప్ప వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదిలా ఉంటే, కర్ణాటక ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన యడియూరప్పకు జూన్‌ 26తో రెండేళ్ల పదివీకాలం పూర్తవుతుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పీఠాన్ని మరొకరికి అప్పజెప్పేందుకు కేంద్ర నాయకత్వం సిద్ధమైందనే వదంతులు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు భాజపా అగ్రనేతలను యడియూరప్ప కలవడం ఇందుకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇదే సమయంలో యడియూరప్ప కుమారుడు బి.వై.విజయేంద్ర పలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. వీటికి తోడు యడియూరప్ప వయసు (78) కూడా అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. ఇలా భిన్న కథనాలు నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై నేడు భాజపా అధిష్ఠానం ఓ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని సమాచారం. అయితే, యడియూరప్పను సీఎం నుంచి తొలగించవద్దంటూ అక్కడి మఠాధిపతులు ఆయనకు మద్దతుగా నిలవడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని