పెగాసస్‌కు భయపడి ఫోన్‌కు ప్లాస్టర్‌ వేశా: దీదీ

తాజా వార్తలు

Updated : 21/07/2021 16:54 IST

పెగాసస్‌కు భయపడి ఫోన్‌కు ప్లాస్టర్‌ వేశా: దీదీ

ప్రజల సొమ్మును నిఘా కోసం ఖర్చుచేస్తున్నారంటూ ధ్వజం

కోల్‌కతా: ప్రజాస్వామ్య భారత్‌ను మోదీ సర్కారు నిఘా దేశంగా తయారు చేయాలనుకుంటోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న ‘పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం’పై స్పందించిన ఆమె.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెగాసస్‌కు భయపడి తన ఫోన్‌కు ప్లాస్టర్‌ వేసుకున్నానని చెప్పిన దీదీ.. ప్రభుత్వ విపరీత చర్యలకు కూడా ప్లాస్టర్‌ వేయాలంటూ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. హ్యాకింగ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. 

కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో దీదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్య భారతంలో సంక్షేమం తీసుకురావడం మాని భాజపా సర్కారు నిఘా దేశంగా మార్చాలనుకుంటోంది. అందుకే పెట్రోల్‌, డీజిల్‌, ఇతర వస్తు, సేవల ద్వారా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తోన్న సొమ్ముతో సంక్షేమ పథకాలు చేపట్టకుండా.. వ్యక్తులపై నిఘా పెట్టేందుకు ‘ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌’ను కొనుగోలు చేసేందుకు వినియోగిస్తోంది. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌.. ప్రజాస్వామ్యానికి ప్రధానమైనవి. పెగాసస్‌ ఈ మూడింటిపైనా దాడిచేసింది. దేశాన్ని భాజపా చీకటిలోకి నెట్టేస్తోంది. ఈ చీకట్లను చీల్చుకుని కొత్త వెలుతురు తీసుకురావాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి’’ అని చెప్పుకొచ్చారు. 

నా ఫోన్‌పైనా నిఘా పెడతారనే..

‘‘నా ఫోన్‌ను కూడా ట్యాపింగ్‌ చేస్తారని తెలుసు. ప్రతిపక్షనేతల ఫోన్లపై కేంద్రం నిఘా పెడుతుందని తెలుసు. అందుకే ఎన్సీసీ అధినేత శరద్‌ పవార్‌జీ, ఇతర ప్రతిపక్ష నేతలు, ముఖ్యమంత్రులతో నేను ఫోన్లలో మాట్లాడలేకపోతున్నా. పెగాసస్‌కు భయపడి నా ఫోన్‌కు ప్లాస్టర్‌ వేసుకున్నా. అయితే ఈ హ్యాకింగ్‌ వంటివేవీ వారిని(భాజపాను ఉద్దేశిస్తూ) రక్షించలేవు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రభుత్వానికి కూడా ప్లాస్టర్‌ వేయాలి. ఇందుకోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. త్వరలో నేను దిల్లీ వెళ్లి ప్రతిపక్ష నేతలను కలుస్తా’’ అని దీదీ వివరించారు. 

హ్యాకింగ్‌ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకోవాలని మమత ఈ సందర్భంగా కోరారు. ‘‘ఇంతమంది ఫోన్లపై నిఘా పెట్టారని తెలిసి ఈ కేసును ఎందుకు సుమోటోగా విచారించకూడదు? కేవలం న్యాయవ్యవస్థ ఒక్కటే దేశాన్ని కాపాడగలదు. దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’’ అని ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. 

సంచలనం సృష్టిస్తోన్న హ్యాకింగ్ వ్యవహారానికి సంబంధించి స్పైవేర్‌ లక్షిత జాబితాలో రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతల ఫోన్‌ నంబర్లు ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, బెంగాల్‌ ఎన్నికల్లో దీదీకి విజయం అందించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఫోన్లపైనా హ్యాకింగ్‌ జరిగినట్లు ది వైర్‌ వార్తా సంస్థ కథనం వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని