నేను తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు.. పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నా: సోనియా

తాజా వార్తలు

Updated : 16/10/2021 13:45 IST

నేను తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు.. పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నా: సోనియా

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందని బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు..తదితర అంశాలే అజెండాగా శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసిన సోనియా.. దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపై మాట్లాడారు.

‘నిజాయతీగా వ్యక్తం చేసే అభిప్రాయాలను నేను ఎప్పుడూ ప్రశంసిస్తాను. మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు. పూర్తి స్థాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను’ అని ఈ సమావేశంలో పాల్గొన్న నేతలందరికీ సోనియా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పార్టీకి పూర్వవైభవం రావాలని కోరుకుంటున్నారన్నారు. అందుకు పార్టీ ప్రయోజనాలు, ఐక్యత అన్నింటికంటే ముఖ్యమని తెలిపారు. జూన్ 30లోపు పార్టీ అధినేతను ఎన్నుకోవాల్సిఉండగా, కొవిడ్ రెండో వేవ్‌ కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడినట్లు చెప్పారు. అలాగే పూర్తిస్థాయి సంస్థాగత ఎన్నికల సంబంధించి స్పష్టత ఇచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజా సమావేశం జరిగింది. అలాగే లఖింపుర్ ఘటన నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఒత్తిడి తీసుకువస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో అక్కడ అధికారాన్ని చేపట్టాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేస్తోంది.  

అధ్యక్షుడిని ఎన్నుకునేది వచ్చే ఏడాదే..!

వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి అధినేతను ఎన్నుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సోనియాగాంధీపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆమె నాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో 57 మంది నేతలు పాల్గొన్నారు. రాహుల్, ప్రియాంక, చిదంబరం, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్ ముఖ్యమంత్రులు భూపేశ్‌ భగేల్‌, చరణ్ జిత్‌ సింగ్ చన్నీ తదితరులు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాలేకపోయారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని