Eatala Rajender: కేసీఆర్‌ ప్రతిష్ఠ, గౌరవం మసకబారింది: ఈటల 

తాజా వార్తలు

Updated : 19/08/2021 14:08 IST

Eatala Rajender: కేసీఆర్‌ ప్రతిష్ఠ, గౌరవం మసకబారింది: ఈటల 

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపు కోసం సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆయన ప్రతిష్ఠ రోజురోజుకూ దిగజారుతోందని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ తెలిపారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో విజయం కోసం తెరాస ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. 

‘‘సీఎంకు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. సొంత పార్టీ మనుషులను కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్‌దే. ఆయన ప్రతిష్ఠ, గౌరవం మసకబారింది. ప్రజాప్రతినిధిగా పనిచేసేవాళ్లు ఎవరైనా తమ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పినా సీఎం పట్టించుకోరు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ప్రజాదర్బార్‌ నిర్వహించేవాళ్లు. ప్రజల సమస్యలు చెప్పుకొనే వీలు లేకుండా కేసీఆర్‌ ప్రజాదర్బార్‌ రద్దు చేశారు. తెలంగాణలో వచ్చే ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. గతంలో ఎప్పుడూ దళితులపై గుర్తురాని ప్రేమ ఇప్పుడెలా గుర్తొచ్చింది?సీఎం సామాజిక వర్గానికి ఎన్ని పదవులు దక్కాయి? దళితులకు ఎన్ని వచ్చాయి? సీఎం కార్యాలయంలో గత ఎనిమిదేళ్లుగా ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అధికారైనా ఉన్నారా? 

హైదరాబాద్‌లో భూములు అమ్మితే వచ్చిన డబ్బులు హుజూరాబాద్‌లో ఖర్చు చేస్తున్నారు. దళితులకు ఇస్తామంటున్న రూ.10లక్షలపై జిల్లా కలెక్టర్, బ్యాంకర్ల అజమాయిషీ లేకుండా చూడాలి. అన్ని కులాల్లో ఉన్న పేద వర్గాలకు రూ.10లక్షలు ఇవ్వాలి. మిగతా వర్గాలకు ఎందుకు ఇవ్వడం లేదు?సోషల్‌ మీడియాలో మాట్లాడుతున్న వారిని బెదిరిస్తున్నారు. ఛాలెంజ్‌ చేస్తున్నా.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలకు వస్తే తెరాసకు డిపాజిట్ కూడా రాదు. ప్రజలకు న్యాయం చేసే పార్టీ భాజపా కాబట్టే ఆ పార్టీలో చేరా. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి అభాసుపాలు కావొద్దు’’ అని ఈటల హితవు పలికారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని