Dalit bandhu: అర్హులందరికీ దళిత బంధు.. ఎవరూ ఆందోళన చెందొద్దు: సీఎస్‌

తాజా వార్తలు

Updated : 14/08/2021 16:19 IST

Dalit bandhu: అర్హులందరికీ దళిత బంధు.. ఎవరూ ఆందోళన చెందొద్దు: సీఎస్‌

కరీంనగర్‌: అర్హులైన వారందరికీ దళిత బంధు అందజేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. గ్రామ సభల ద్వారా దళిత బంధు సాయాన్ని పంపిణీ చేస్తామని వెల్లడించారు. పైలట్‌ ప్రాజెక్టు కింద ముందుగా హుజూరాబాద్‌లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. హుజూరాబాద్‌లో ఈ నెల 16న జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు సీఎస్‌ సమీక్షించారు. బహిరంగ సభ ఏర్పాట్లు, దళిత బంధు సాయం పంపిణీ, తదితర అంశాలపై సమీక్షించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పరిధిలోని శాలపల్లి ఇందిరానగర్‌లో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు.. అద్భుతమైన పథకం అని.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. 15 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులను అందజేయనున్నట్లు సీఎస్‌ వెల్లడించారు.

నూరు శాతం అందిస్తాం: హరీశ్‌రావు

సభ ఏర్పాట్లపై కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్ష అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భాజపా నేతలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. రైతు బంధు ప్రారంభించినప్పుడు కూడా ఇలానే అపోహలు సృష్టించారు. ఓటమి భయంతో ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. ఎల్లుండి సీఎం చేతుల మీదుగా హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ను సీఎం ఎంపిక చేశారు. దళిత బంధు పథకం అర్హులందరికీ నూరు శాతం అందిస్తాం. ఈ పథకానికి రూ.2వేల కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే ఎవరైనా ఆహ్వానిస్తారు. బండి సంజయ్ రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకు రూ.10 లక్షలు అందిస్తున్నాం. మిగతా రూ.40 లక్షలు కేంద్రం నుంచి బండి సంజయ్‌ తీసుకురావాలి. కేంద్రం నుంచి ఆర్థిక సాయం తెస్తే పాలాభిషేకం చేస్తాం. దళిత బంధు సాయం అందించేందుకు ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారిని నియమించాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నియోజకవర్గంలో అర్హులందరికీ దళిత బంధు అందుతుంది’’ అని హరీశ్‌రావు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని