Bharat Bandh: భారత్‌ బంద్‌.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

తాజా వార్తలు

Updated : 27/09/2021 10:59 IST

Bharat Bandh: భారత్‌ బంద్‌.. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతోంది. ఈ బంద్‌లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు పాల్గొంటున్నాయి. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్‌ఆద్మీ, తెదేపాతో పాటు పలు రైతు సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. బంద్‌ నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.  ఇండియా గేట్‌, విజయ్‌ చౌక్‌ సహా ముఖ్యమైన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన శిబిరాల నుంచి రైతులు దిల్లీలోకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 

ఏపీ ప్రభుత్వం భారత్‌ బంద్‌కు సంఘీభావం ప్రకటించింది. రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. బంద్‌కు సంఘీభావంగా సోమవారం మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు పాఠశాలలకూ సెలవు ప్రకటించారు. బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో పలుచోట్ల విపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తిరుపతిలో తెదేపా, వామపక్షాలు సహా వివిధ రైతు, కార్మిక సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

డిపోల వద్ద బస్సులు అడ్డుకున్న విపక్ష నేతలు

బంద్‌ కారణంగా తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హనుమకొండలో వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రీజియన్‌ పరిధిలో 842 బస్సులు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు నిరసన తెలిపారు. బస్టాండ్‌ ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కాంగ్రెస్‌, సీపీఐ,సీపీఎం సహా పలు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. షాద్‌నగర్‌ డిపో నుంచి బస్సులు రాకుండా గేటు వద్ద నేతలు అడ్డుకున్నారు. అత్యవసర సేవలకు బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. సాయంత్రం 4 గంటల వరకు భారత్‌ బంద్‌ కొనసాగనుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని