‘మోదీజీ.. మాతో ఎప్పుడూ గొడవెందుకు?’ 

తాజా వార్తలు

Published : 24/06/2021 00:59 IST

‘మోదీజీ.. మాతో ఎప్పుడూ గొడవెందుకు?’ 

దిల్లీ: దేశ రాజధానిలో ఇంటింటికీ రేషన్‌ అందించాలన్న ఆప్‌ సర్కార్‌ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడంపై దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా తీవ్రంగా స్పందించారు. అసలు కేంద్ర ఆమోదం కోసం తాము ఎలాంటి ప్రతిపాదనను పంపకపోయినా తిరస్కరిస్తున్నట్టు లేఖ రాయడం హాస్యాస్పదమన్నారు. రేషన్‌ ఎలా పంపిణీ చేయాలనే విషయంలో పూర్తి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలేదనని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ఎప్పుడూ గొడవ పడే మూడ్‌లోనే ఎందుకు ఉంటారో ప్రధానిని తాను అడగదలచుకున్నట్టు చెప్పారు. గత 75 ఏళ్లలో ఇంతలా తగాదా పడే ప్రధానిని దేశం ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. బెంగాల్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలతోనూ గొడవేనన్నారు. ప్రధాని ఇలాంటి గొడవలు మానుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 

మరోవైపు, ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయాలని దిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ పథకం అమలులో ఇబ్బందులు, లోపాలను ఎత్తిచూపుతూ కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ దిల్లీ ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాసింది. హోం డెలివరీ కింద రేషన్‌ ధరలను పేర్కొనలేదని, లబ్ధిదారుడు అడ్రస్‌ మారితే.. వారి చిరునామాలను నిరంతరం ఎలా అప్‌డేట్‌ చేస్తారని ప్రశ్నించింది. అంతేకాకుండా ఇరుకైన వీధుల్లో, బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న లబ్ధిదారులకు ఎలా రేషన్‌ అందిస్తారు? రేషన్‌ డెలివరీ చేసే వ్యాన్‌లు బ్రేక్‌డౌన్‌ అయితే పరిస్థితి ఏంటి? అని సందేహాలను వ్యక్తంచేసింది. దీనిపై సిసోడియా స్పందిస్తూ.. ఎంత ధరకు ఇస్తున్నామో కేంద్రం అడగవచ్చని, తాము కూడా చెబుతామన్నారు. కానీ కేంద్రం ఆమోదం కోసం తాము ఎలాంటి ప్రతిపాదనా పంపనప్పుడు తిరస్కరిస్తున్నట్టు ఎలా చెబుతారని ప్రశ్నించారు. పిజ్జాలు, బట్టలు, ఇతర వినియోగ వస్తువులను డోర్‌ డెలివరీ చేస్తున్నప్పుడు  రేషన్‌ను ఎందుకు చేయలేమన్నారు. 

దిల్లీలో ఇంటింటికీ రేషన్‌ సరఫరా పథకాన్ని జూన్‌లోనే ప్రారంభించాలని ఆప్‌ సర్కార్‌ ప్రయత్నించినప్పటికీ.. దీన్ని అమలుచేయలేమంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఫైల్‌ను తిరిగి పంపడంతో ఆగిపోయినట్టు సీఎంవో కార్యాలయం పేర్కొంటోంది.  ఈ పథకం అమలైతే 72లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని