నాడు తండ్రి.. నేడు కుమారుడు.. ఒకే శాఖ

తాజా వార్తలు

Updated : 08/07/2021 16:39 IST

నాడు తండ్రి.. నేడు కుమారుడు.. ఒకే శాఖ

30ఏళ్ల తర్వాత తండ్రి బాధ్యతల్లో సింధియా 

దిల్లీ: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌర విమానయాన శాఖ అప్పగించారు. అయితే, 30ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావ్‌ సింధియా కూడా పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడే అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం. 

1991-93 మధ్య పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మాధవరావ్‌ సింధియా.. పౌర విమానయానం, పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో పౌర విమానయాన మంత్రిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఓ విమానం కూలిన ఘటనకు బాధ్యతవహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా.. ఇప్పుడు జ్యోతిరాదిత్య ముందు కూడా పెద్ద సవాలే ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు విమానయాన రంగం దెబ్బతింది. కరోనా ముందుతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖను జూనియర్‌ సింధియా సురక్షితంగా ల్యాండ్‌ చేస్తారో లేదో చూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.

తండ్రి బాటలోనే..

మాధవరావ్‌ సింధియా 2001లో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ఓ విమానం ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి శివార్లలో కుప్పకూలింది. తండ్రి హఠాన్మరణంతో జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లో అడుగుపెట్టారు. మాధవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్‌సభ నియోజకవర్గానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 

రాజకీయ కెరీర్ పరంగా ఈ తండ్రీకొడుకుల మధ్య చాలా పోలికలే ఉన్నాయి. పౌరవిమానయాన శాఖ బాధ్యతలు చేపట్టకముందు ఇద్దరూ కేంద్రమంత్రులుగా పనిచేశారు. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంలో మాధవరావ్‌ రైల్వే మంత్రిగా వ్యవహరించగా.. మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారులో జ్యోతిరాదిత్య ఐటీ, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 

పార్టీ మారి.. కేంద్రమంత్రిగా 

అయితే ఒక విషయంలో మాత్రం వీరిద్దరూ పరస్పరం భిన్నంగా ఉన్నారు. మాధవరావు తొలుత జనసంఘ్‌లో పనిచేశారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. కానీ, జ్యోతిరాదిత్య మాత్రం కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరారు. ఇద్దరికీ పార్టీ మారిన తర్వాతే కేంద్రమంత్రి పదవి దక్కడం గమనార్హం. 2002లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జ్యోతిరాదిత్య దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 

అయితే గతేడాది గాంధీ కుటుంబానికి, సింధియాకు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో 2020 మార్చి 10న మాధవరావు జయంతి సందర్భంగా తన రాజకీయ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించారు జూనియర్‌ సింధియా. ఆ రోజే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి భాజపాలో చేరారు. సింధియాతో పాటు మధ్యప్రదేశ్‌లో చాలా మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్‌నాథ్‌ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్‌సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని