నాకు వ్యతిరేకంగా మాట్లాడటం వాళ్లకు కొత్తేం కాదు! 

తాజా వార్తలు

Published : 19/06/2021 01:08 IST

నాకు వ్యతిరేకంగా మాట్లాడటం వాళ్లకు కొత్తేం కాదు! 

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం లేదన్న యడియూరప్ప

బెంగళూరు: కర్ణాటకలోని అధికార భాజపాలో అసమ్మతి, నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న వేళ సీఎం యడియూరప్ప శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం, గందరగోళం ఏమీ లేదన్నారు. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. తన చిన్న కుమారుడు బీవై విజయేంద్ర అవినీతిపై బహిరంగంగా నిరాధారమైన ఆరోపణలు చేసిన పార్టీ ఎమ్మెల్సీ ఏహెచ్‌ విశ్వనాథ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది భాజపా హైకమాండ్‌ నిర్ణయిస్తుందని చెప్పారు. ‘‘రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏమీలేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మీడియా ముందు ఏదో మాట్లాడటంతో, అపార్థాలకు తావు కలిగింది. నాకు వ్యతిరేకంగా ఒకరిద్దరు మాట్లాడటం కొత్తేమీ కాదు. మొదటి నుంచీ వాళ్లు అదే పనిచేస్తున్నారు’’ అన్నారు. 60మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ను గురువారం కలిశారన్నారు. పార్టీలో గందరగోళం ఏమీ లేదని, అంతా కలిసే ఐక్యంగా అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. ఒకరిద్దరు వ్యక్తులు చేస్తున్న ఇలాంటి పనులు తన కేబినెట్‌ సహచరులను ప్రభావితం చేయలేవన్నారు. తనకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

జలవనరుల శాఖలో తన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్సీ విశ్వనాథ్‌ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. నీటి పారుదల శాఖ కార్యదర్శి దీనిపై పూర్తిగా వివరణ ఇస్తారని మీడియాకు తెలిపారు. రాజకీయపరమైన కారణాలతో కొందరు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని మంత్రిత్వశాఖలూ ఐక్యంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.  

సీఎంగా యడియూరప్పను మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వినబడుతున్న తరుణంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక భాజపా ఇన్‌ఛార్జి అరుణ్‌ సింగ్‌ గురువారం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. నాయకత్వ మార్పు కావాలని, వద్దని చెప్పేవారితో పాటు తటస్థుల అభిప్రాయాలనూ సేకరించారు. నాయకత్వ మార్పును బలంగా కోరుకొనేవారితో మాట్లాడేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని