ప్రజల్లో కాంగ్రెస్‌ అలజడి సృష్టిస్తోంది: నడ్డా

తాజా వార్తలు

Published : 12/05/2021 00:58 IST

ప్రజల్లో కాంగ్రెస్‌ అలజడి సృష్టిస్తోంది: నడ్డా

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా ఆరోపించారు. ప్రజలకు ఏమాత్రం మనోధైర్యం కల్పించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌లో కొంతమంది మంచి పనిచేస్తున్నప్పటికీ.. సీనియర్ నాయకులు మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యాప్తి చేయడంలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. దేశంలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నడ్డా వారిపై విరుచుకుపడుతూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.

కరోనా నివారణ, నియంత్రణ చర్యలపై 2020 మార్చి నుంచి ప్రధాని మోదీ పూర్తి స్థాయిలో దృష్టి సారించారని నడ్డా పేర్కొన్నారు. ముఖ్యమంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. మోదీ చేస్తున్న కృషిని మాజీ ప్రధాని హెచ్‌.డి.దెవెగౌడ ప్రశంసించారని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రులు కొవిడ్‌తో పోరాటం గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని, ప్రజల్లో గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న నడ్డా ఆరోపించారు.

గత ఏడాది దేశ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు..  కాంగ్రెస్‌ సీఎంలు సహా ఇతర నాయకులు వారిని ఎగతాళి చేశారని నడ్డా ఆరోపించారు. కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు టీకాపై వ్యతిరేక ప్రచారానికి కూడా సిద్ధమయ్యారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రజల్లో వ్యాక్సిన్‌పై అపోహకలకు ఇది కూడా ఒక కారణమని నడ్డా చెప్పుకొచ్చారు.

కేంద్రం మొదటి దశలో 16 మిలియన్ వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఇచ్చిందని.. ఇప్పుడు కూడా యాభై శాతం ఉచితంగా ఇస్తున్నట్లు నడ్డా ఈ లేఖ ద్వారా సోనియా దృష్టికి తీసుకొచ్చారు. భాజపా లేదా ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలు పేదలు, అణగారిన వర్గాల వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించాయని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సైతం అదే విధానాన్ని అనుసరిస్తాయని భావిస్తున్నానన్నారు. భారతదేశంలో తయారయ్యే వ్యాక్సిన్ ఏ ఒక్క పార్టీకి చెందినది కాదని.. అవి దేశం మొత్తానికి చెందినయని వ్యాఖ్యానించారు. పీఎం కేర్స్ నిధులతో 45 వేల వెంటిలేటర్లను రాష్ట్రాలకు పంపగా.. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా వాటిని ప్రారంభించకపోవడం విచారకరమని నడ్డా అన్నారు.

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీపైనా నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ ప్రవర్తన విచిత్రంగా ఉందని విమర్శించారు. ఆయన కొన్నిసార్లు లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని.. మరికొన్నిసార్లు మద్దతుగా మాట్లాడారని నడ్డా ఆరోపించారు. ఎన్నికల ర్యాలీల నిర్వహణపై కూడా ఇదే విధంగా వ్యవహరించి ప్రజలను అయోమయానికి గురి చేశారన్నారు.

ఒక వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉత్తర భారతదేశంలో సూపర్-స్ప్రెడర్ ర్యాలీలు చేశారన్నారు. ఫిబ్రవరి, మార్చి గణాంకాలు చూస్తే కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ఏ రాష్ట్రాలు విఫలమయ్యాయో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన పంజాబ్‌లో మరణాల రేటు ఎందుకు అంత ఎక్కువగా ఉందని నడ్డా ప్రశ్నించారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రశ్నలు సంధిస్తున్న కాంగ్రెస్.. ఛత్తీస్‌గఢ్‌  కొత్త అసెంబ్లీ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు చేయడాన్ని గమనించడం లేదా అని ప్రశ్నించారు. 70 ఏళ్లలో ఆరోగ్య వ్యవస్థలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు సరిపోవని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించిందన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్‌ తప్పుడు నిర్ణయాల జాబితా చాలా పెద్దగా ఉంటుందని ఎద్దేవా చేశారు. కానీ, ఈ సమయంలో రాజకీయాలు చేయడం తన లక్ష్యం కాదు అని లేఖలో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని