నందిగ్రామ్‌నే ఎందుకు ఎంచుకున్నానో తెలుసా?: దీదీ 

తాజా వార్తలు

Published : 30/03/2021 16:51 IST

నందిగ్రామ్‌నే ఎందుకు ఎంచుకున్నానో తెలుసా?: దీదీ 

నందిగ్రామ్‌: బెంగాల్‌లో రెండో విడత ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగియనుండటంతో నందిగ్రామ్‌లో తృణమూల్‌, భాజపా నేతలు ప్రచారం హోరెత్తించారు. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, భాజపా అగ్రనేత అమిత్‌ షా నందిగ్రామ్‌లో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాటల తూటాలు పేల్చారు. సోనాచురాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దీదీ మాట్లాడుతూ.. నందిగ్రామ్‌లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు భాజపా పాలిత రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలను తీసుకొచ్చారని ఆరోపించారు. గ్రామాల్లోని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు భాజపాకు అనుకూలంగా ఓటు వేసేలా ఒత్తిడిచేసే ప్రయత్నంలో భాగంగా మధ్యప్రదేశ్ నుంచి పోలీసు బలగాలను మోహరించారన్నారు. నందిగ్రామ్‌ నుంచి భారీ విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తంచేసిన దీదీ.. మూడోసారి బెంగాల్‌లో అధికారం తమదేనన్నారు. 

నందిగ్రామ్‌ నుంచి పోటీ అందుకే..

‘‘నేను ఇంకే నియోజకవర్గం నుంచైనా పోటీ చేయగలను. కానీ నందిగ్రామ్‌నే ఎంచుకున్నా. నా తల్లులు, సోదరులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకే. నందిగ్రామ్‌ పోరాటానికి సెల్యూట్‌ చేసేందుకే సింగూరు కన్నా నందిగ్రామ్‌ని ఎంచుకున్నా. ఒకసారి నందిగ్రామ్‌లోకి ప్రవేశిస్తే వదిలివెళ్లను. నందిగ్రామ్‌ నా ప్రాంతం. ఇక్కడే ఉంటా’’ అని దీదీ అన్నారు. 

బయటినుంచి తీసుకొచ్చిన పోలీసులు కొద్ది రోజులే ఉంటారని, తప్పు చేయొద్దని మమత సూచించారు. తామే మళ్లీ అధికారంలోకి వస్తామన్న దీదీ.. ద్రోహులకు తగిన రీతిలో సమాధానం చెబుతామంటూ సువేందును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌ 1న పోలింగ్‌కు ముందు నందిగ్రామ్‌లో మతపరమైన అల్లర్లను ప్రేరేపించే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నందిగ్రామ్‌లో ఆఖరి రోజు ప్రచారం నేపథ్యంలో దీదీ మూడు కి.మీల పాటు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా తృణమూల్‌ కార్యకర్తలు, అభిమానులు జైహింద్‌, జై బంగ్ల, మమతా బెనర్జీ జిందాబాద్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నందిగ్రామ్‌ను హోరెత్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని