కమల్‌నాథ్‌ చేతికి కాంగ్రెస్‌ పగ్గాలు..?

తాజా వార్తలు

Published : 16/07/2021 01:38 IST

కమల్‌నాథ్‌ చేతికి కాంగ్రెస్‌ పగ్గాలు..?

 సోనియాగాంధీతో భేటీ అయిన మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం

ఇంటర్నెట్‌డెస్క్‌: దశాబ్దాల ఘన చరిత కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా..?గాంధీల కుటుంబం నుంచి కాకుండా మరో వ్యక్తికి సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. పార్టీ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కాంగ్రెస్‌ పగ్గాలు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కమల్‌నాథ్ భేటీ అవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చినట్లయింది. 

గురువారం సోనియగాంధీ నివాసానికి వెళ్లిన కమల్‌నాథ్‌.. ఆమెతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీలో మార్పుల గురించి వీరిద్దరూ చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో కమల్‌నాథ్‌ పేరు గతకొంతకాలంగా వినిపిస్తోంది. దీంతో ఈ విషయంపైనే వీరిద్దరూ తాజాగా భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

గాంధీ కుటుంబానికి విధేయుడు..

గాంధీ కుటుంబానికి కమల్‌నాథ్‌ అత్యంత సన్నిహితుడు. రాహుల్‌గాంధీతోనూ ఆయనకు మంచి అనుబంధం ఉంది. 1980లో తొలిసారిగా ఎన్నికైన ఆయన.. తొమ్మిసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ తర్వాత పార్టీలో అన్ని వర్గాలతో అనుబంధం ఉన్న నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 

త్వరలోనే ఎన్నికలు..

2017లో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్‌.. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో మళ్లీ సోనియాగాంధీకే తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి అధ్యక్ష పదవికి ఎన్నికలు వాయిదా పడుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేశారు. తాజాగా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తర్వాత అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని