Politics: జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు..?

తాజా వార్తలు

Published : 14/06/2021 01:32 IST

Politics: జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు..?

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కశ్మీర్‌ ప్రాంతంలోని ఏడు ప్రధాన పార్టీలతో ఏర్పడిన పీపుల్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌ (పీజీడీఏ) నేతలతో కేంద్రం సంప్రదింపులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకహోదా రద్దు చేయక ముందు  భాజపా, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రాజకీయకారణాల వల్ల 2018లో కూటమి నుంచి భాజపా వైదొలగింది. దీంతో జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. ఆ తర్వాత 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేపట్టింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ క్రమంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలవల్ల 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు అక్కడ పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త అదుపులోకి రావడంతో పీజీడీఏ నేతలతో  సంప్రదింపులు జరిపి ఎన్నికలు నిర్వహించడం ద్వారా కశ్మీర్‌లోయలో మునుపటి పరిస్థితులను తీసుకొచ్చేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది.

మరోవైపు కేంద్రంతో చర్చలకు తాము సిద్ధంగా ఉంటున్నట్లు గుప్‌కార్‌ అలయన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడించారు. వీలైనంత త్వరగా కశ్మీర్‌లో పూర్వపుస్థితిని తీసుకురావడమే లక్ష్యంగా గత ఏడాది ఆగస్టులో పీజీడీఏ ఏర్పాటైంది. అయితే అంతర్గత కారణాల వల్ల దాదాపు 6 నెలల పాటు స్తబ్ధుగా ఉండిపోయింది. గత బుధవారం పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్షురాలు మెహబూబాముఫ్తీతో ఫరూక్‌ అబ్దుల్లా ఆమె నివాసంలో భేటీ అయ్యారు. కూటమి పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాతనే కేంద్రంతో చర్చలకు సిద్ధమవుతుండటం గమనార్హం. కశ్మీర్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీతోపాటు, పీడీపీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, జమ్మూకశ్మీర్‌ అప్నీ తదితర ఏడు పార్టీలు పీజీడీఏలో భాగస్వాములుగా ఉన్నాయి.

కశ్మీర్‌లో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చూడాలని, వీలైతే ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని భారత్‌కు అమెరికా సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందడుగు వేసినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశంలో కశ్మీర్‌ అంశం చర్చకు వచ్చింది. ‘‘ కశ్మీర్‌ ప్రాంతంలో వీలైనంత త్వరగా ఇంతకుముందున్న పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని భారత్‌ను కోరుతున్నాం. అవసరమైతే దీనికి అమెరికా సహకారం కూడా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ బందీలను విడుదల చేయడం, కశ్మీర్‌లోయలో 4జీ సేవలను పునరుద్ధరించడం లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది’’ అని అమెరికా వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌ రాజకీయపార్టీల నేతలతో కేంద్రం చర్చలకు జరిపేందుకు సిద్ధమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని