అధ్యక్ష ఎన్నికలపై కాంగ్రెస్‌ మూడో‘సారీ’

తాజా వార్తలు

Published : 10/05/2021 17:06 IST

అధ్యక్ష ఎన్నికలపై కాంగ్రెస్‌ మూడో‘సారీ’

పార్టీ సారథిపై తొలగని ప్రతిష్టంభన

దిల్లీ: దశాబ్దాల ఘన చరిత గల కాంగ్రెస్‌ పార్టీని నడిపించే అధ్యక్షుడిపై  నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పుడప్పుడే తొలగేలా కన్పించట్లేదు. ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికలను హస్తం పార్టీ వాయిదా వేసింది. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించకూడదని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. 

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సోనియాగాంధీ నేతృత్వంలో సీడబ్ల్యూసీ కమిటీ నేడు సమావేశమైంది. ఈ భేటీలో అధ్యక్ష ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. జూన్‌ 23న ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ సిఫార్సు చేసింది. అయితే ప్రస్తుతం కరోనా ఉద్ధృతి సమయంలో ఎన్నికలు నిర్వహణను మెజార్టీ సీడబ్ల్యూసీ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని కమిటీ నిర్ణయించింది. తదుపరి తేదీలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.

రెండేళ్లుగా తాత్కాలిక అధ్యక్షురాలే..
 
పూర్తిస్థాయి సారథి కోసం కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్లుగా ఎదురుచూస్తోంది. 2017లో పెట్టిన అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికై పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టారు. గతేడాది ఆగస్టులో అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ.. మరో ఆరునెలల పాటు సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగించాలని సీడబ్ల్యూసీ కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో సారథిని ఎన్నుకోవాలని అనుకోగా.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు జూన్‌లో నిర్వహించాలని కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం సూచించినా.. కొవిడ్‌ వల్ల మూడోసారి వాయిదా పడింది. 

పార్టీ అధినాయకత్వంలో మార్పులు జరగాలని, అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని జి-23గా పిలవబడే కాంగ్రెస్‌ అసమ్మతి నేతల బృందం గత కొన్ని నెలలుగా డిమాండ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. తమిళనాడులో డీఎంకే కూటమిలో మినహా.. మిగతా ఎక్కడా విజయం వరించలేదు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని