టీకా పంపిణీపై కేంద్రంపై ఒత్తిడి చేయండి: సోనియా

తాజా వార్తలు

Updated : 25/06/2021 11:50 IST

టీకా పంపిణీపై కేంద్రంపై ఒత్తిడి చేయండి: సోనియా

దిల్లీ: వ్యాక్సిన్‌ పంపిణీ మరింత వేగవంతంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదే సమయంలో కరోనా సంబంధిత సహాయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు వ్యాక్సినేషన్‌పై నెలకొన్న అపోహలను తొలగించడంలో తమవంతు కృషిచేయాలని సూచించారు. రానున్న రోజుల్లో థర్డ్‌వేవ్‌ విజృంభించే అవకాశాలున్నాయని నివేదికలు వస్తున్న తరుణంలో.. ఎదుర్కొనేందుకు ముమ్మర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. తద్వారా కరోనా ప్రభావం నుంచి పిల్లలను కాపాడుకోవచ్చని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు.

‘వ్యాక్సిన్‌ సరఫరాపైనే పంపిణీ వేగం ఆధారపడి ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో టీకాలను గణనీయంగా పెంచడంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం కొనసాగించాలి. అదే సమయంలో టీకాలపై నెలకొనే అపోహలు, వ్యాక్సిన్‌ వృథాను అరికట్టడంలో మనవంతు కృషి చేయాలి’ అని వివిధ రాష్ట్రాల ఏఐసీసీ ఇంఛార్జీలు, పార్టీ జనరల్‌ సెక్రటరీలతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా రెండో వేవ్‌ సృష్టించిన విలయాన్ని దృష్టిలో ఉంచుకొని తదుపరి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న ఇంధన ధరలు లక్షల పేద కుటుంబాలపై తీవ్ర భారాన్ని మోపుతున్నాయని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటితోపాటు నిత్యవసర వస్తువుల ధరలు, నిరుద్యోగం ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో వీటిని నియంత్రించే చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే కార్యచరణ కొనసాగించాలని పార్టీ నాయకులకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని