‘అమిత్‌షా వైదొలగాలి.. మోదీ పాత్ర తేలాలి’ 

తాజా వార్తలు

Published : 20/07/2021 01:55 IST

‘అమిత్‌షా వైదొలగాలి.. మోదీ పాత్ర తేలాలి’ 

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌ గురైనట్లు వచ్చిన వార్తలపై కేంద్రంపై కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడింది. హ్యాకింగ్‌ ద్వారా ప్రభుత్వం రాజద్రోహానికి పాల్పడడమే కాకుండా జాతీయ భద్రత విషయంలో రాజీ పడిందని ఆరోపించింది. హోంమంత్రి అమిత్‌షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ పాత్ర కూడా తేలాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు.

పెగాసస్‌ వ్యవహారంలో విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని సూర్జేవాలా పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, జాతీయ భద్రతను మోదీ ప్రభుత్వం కూనీ చేసిందని ఆరోపించారు. అమిత్‌ షాకు ఇక ఎంతమాత్రం పదవిలో కొనసాగే అర్హత లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. డిజిటల్‌ ఇండియా పేరు చెప్పి నిఘా దేశంగా మార్చేశారని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి విమర్శించారు. 

మరోవైపు స్పైవేర్‌ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి, భాజపా అధికార ప్రతినిధి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. హ్యాకింగ్‌ నివేదికలు విడుదల చేస్తున్న సంస్థలు కూడా ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. కేవలం పార్లమెంట్‌ సమావేశాలకు ఆటంకం కలిగించేందుకే కాంగ్రెస్‌ పార్టీ ఇటువంటి నిరాధార, రాజకీయ ఆరోపణలను చేస్తోందని దుయ్యబట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని