AP News: మధ్యతరగతికి జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు

తాజా వార్తలు

Updated : 30/06/2021 18:00 IST

AP News: మధ్యతరగతికి జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు

పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం!

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్‌ నిర్ణయాలను రాష్ట్ర మంత్రి పేర్ని నాని సచివాలయంలో మీడియాకు వివరించారు.

కేబినెట్‌ నిర్ణయాలివే..

* రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉత్పత్తుల విలువ పెంచేందుకు, గిట్టుబాటు ధర కల్పించేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ 2021-22కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని కోసం ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం. రైతలకు గిట్టుబాటు ధర కోసం రూ.6వేల కోట్లు ఖర్చు చేశాం.

* కడప జిల్లా ఊటుకూరులో ఖడక్‌నాథ్‌ కోళ్ల హ్యాచరీకి మంత్రివర్గం ఆమోదం.

* రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

* దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు వీలుగా రాష్ట్ర  ప్రభుత్వం రూపొందించిన వైఎస్సార్‌ బీమా పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్యాంకు ఖాతా కలిగి ఉన్న  కోటి 20లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించింది. కానీ బ్యాంకులు 60లక్షల మందిని మాత్రమే అర్హులుగా నిర్ధరించాయి.

 

* రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జులై 1, 3, 4 తేదీల్లో శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం. 15.60 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహణ.

* అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో నగదు వద్దనుకుని ల్యాప్‌టాప్‌ కావాలని లిఖితపూర్వకంగా తెలిపిన లబ్ధిదారులకు ల్యాప్‌ట్యాప్‌లు అందించేందుకు కేబినెట్‌ నిర్ణయం. 9 నుంచి 12 తరగతి మధ్య చదువుతున్నవారిలో నగదు వద్దని ల్యాప్‌ట్యాప్‌ కావాలని 8,21,656 మంది లిఖితపూర్వకంగా ఇచ్చారు. కళాశాల విద్యార్థులు 9,54,031 మంది ఉంటే వారిలో 1,10,779 మంది ఐచ్ఛికంగా ల్యాప్‌ ట్యాప్‌ ఎంచుకున్నారు. వీరికి లెనోవా, డెల్‌ ఏసర్‌, హెచ్‌పీ లాంటి ప్రముఖ కంపెనీల ల్యాప్‌ట్యాప్‌లు 3 సంవత్సరాల వారంటీతో ఇవ్వడం జరుగుతుంది.

* ప్రకాశం జిల్లా పేర్నమిట్టలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం (మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ), విజయనగరం జిల్లాలో జేఎన్‌టీయూ విజయనగరం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

* మధ్య తరగతి వారికి సొంతింటి కల నెరవేర్చేందుకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను సేకరించి 150, 200, 240 గజాల చొప్పున మూడు కేటగిరీలుగా విభజిస్తారు. యధార్థ వ్యయ విలువను మదింపు చేసి ఆ ధరకు మధ్యతరగతి వారికి లాటరీ ద్వారా ఇళ్లు కేటాయిస్తారు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్‌లో నివాస ఆధారం ఉన్నవారే అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

 

* గ్రామకంఠం భూమిలో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

* సమగ్ర భూ సర్వేలో వ్యవసాయేతర ఆస్తులకు కూడా టైటిల్‌ డీడ్‌‌ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం.

* కాకినాడ ఎస్‌ఈజెడ్‌ కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో 2,180 ఎకరాల భూమిని రైతులకు వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్‌ నిర్ణయం. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్‌ ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.

* వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి పీహెచ్‌సీలో 104 ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయం. 539 అంబులెన్స్‌లను రూ.80కోట్లతో కొనుగోలు చేసేందుకు ఆమోదం. 

* రాయలసీమ కరవు నివారణ పథకం కింద పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులను నింపేందుకు రూ.864 కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం.

* ఐటీ పాలసీ 2021-24ను కేబినెట్‌ ఆమోదించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని