
తాజా వార్తలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సీఎం జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చ జరిగింది. రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. కాకినాడ ఎస్ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్ఈజెడ్ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది. వైఎస్సార్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా రూ.45వేలు అందించనున్నారు. కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
రూ.670 కోట్లతో ‘ఈబీసీ నేస్తం’: పేర్ని నాని
అగ్రవర్ణ పేద మహిళల కోసం అమలు చేయనున్న ఈబీసీ నేస్తం పథకానికి రూ.670కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. 45-60 ఏళ్లలోపు అగ్రవర్ణ పేద మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు చెప్పారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ఈబీసీ వర్గానికి చెందిన ఒక్కో మహిళకు ఏడాదికి రూ.15వేలు చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45వేల సాయం అందిస్తామన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద సంపూర్ణంగా బోధనా ఫీజు చెల్లింపులు చేస్తామని చెప్పారు. నిర్ణీత కాలపట్టిక ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని.. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే దానిపై కాలపట్టిక రూపొందించనున్నట్లు మంత్రి వివరించారు. పట్టణ ప్రాంతాల్లో రూ.1.43లక్షల మంది లబ్ధిదారులకు రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇళ్లు అప్పగిస్తామన్నారు. ఇళ్ల కోసం తీసుకున్న రూ.లక్ష రుణంలో రూ.50వేలు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వ లేఅవుట్లలో 5 శాతం భూమిని పేదలకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్ని నాని చెప్పారు.