Eatala: నేనూ బీసీ బిడ్డనే.. బెదిరిస్తే భయపడను:గంగుల

తాజా వార్తలు

Updated : 18/05/2021 15:45 IST

Eatala: నేనూ బీసీ బిడ్డనే.. బెదిరిస్తే భయపడను:గంగుల

కరీంనగర్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. రాజీనామా చేస్తే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లో ఈటల పరోక్షంగా విమర్శలు చేసిన నేపథ్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గంగుల మాట్లాడారు. పదవుల కోసం పెదవులు మూయను అని చెప్పిన ఈటల.. కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసినా పదవి పట్టుకుని ఊగుతున్నారని ఆక్షేపించారు. ఇది ఆత్మగౌరవమా?ఆత్మ వంచనా?అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ప్రజలంతా నీ వెంటే ఉన్నపుడు రాజీనామా ఎందుకు చేయడం లేదని ఈటలను నిలదీశారు. 

వారితో ఎందుకు కుమ్మక్కయ్యావ్‌?

‘‘ప్రజలంతా నీ వెంటే ఉన్నపుడు ప్రజాక్షేత్రంలోనే తీర్పు కోరుకుందాం. నాపై ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నావు. ఆరుసార్లు గెలిచానని అంటున్నావు కదా.. రాజీనామా చేసి తేల్చుకో. కార్యకర్తలు అమ్ముడుబోయే వ్యక్తులుగా ఉంటున్నారా? కొనుగోలు చేసేది మీరు. మీ గుండెమీద చేయి వేసి చెప్పు. ఎంతమందికి డబ్బులు పంపి ఆపే ప్రయత్నం చేశావ్‌? కరీంనగర్‌ జిల్లా మొత్తం బొందల గడ్డగా మార్చారని.. ఓ మంత్రి ట్యాక్స్‌ ఎగ్గొట్టారని మాట్లాడావు. 2004లో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో తమిళనాడుకు చెందిన ఎన్ని గ్రానైట్‌ క్వారీలు నడిచాయో నా దగ్గర లిస్ట్‌ ఉంది. నీ నియోజకవర్గంలో ఏనాడైనా గ్రానైట్ క్వారీ ఆపే ప్రయత్నం చేశావా? ఎందుకు వారితో కుమ్మక్కయ్యావు? ఏరోజైనా మంత్రిగా కేబినెట్‌లో కానీ.. పత్రికా ముఖంగా కానీ ఆపే ప్రయత్నం చేశావా? సమాధానం చెప్పు? బొందల గడ్డగా నడుస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నావు.

నేనూ బీసీ బిడ్డనే.. బెదిరిస్తే భయపడేవారు ఎవరూ లేరు

ట్యాక్స్‌లు ఎగ్గొడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ట్యాక్స్‌ ఎగ్గొటినట్లు రుజువైతే 5 రెట్లు అధికంగా కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్‌ విసురుతున్నా. నీవి దొంగభూములని అధికారులు తేల్చారు.. ఆత్మగౌరవం ఉంటే వాటిని ప్రభుత్వానికి అప్పజెప్పు. బిడ్దా అని మాట్లాడుతున్నావ్‌.. నేనూ బీసీ బిడ్డనే. బెదిరిస్తే భయపడేవారు ఎవరూ లేరిక్కడ. నువ్వు హుజూరాబాద్‌లో బీసీ.. హైదరాబాద్‌లో ఓసీ. ఇంకా ఎక్కువ మాట్లాడగలం. తెరాసలో ఉన్నావ్ కాబట్టి ఇన్నాళ్లూ గౌరవించాం. రాజకీయాల్లోకి రాకముందు 1992 నుంచే చట్టబద్ధంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాం. 2018 ఎన్నికల్లో నేను ఓడిపోవాలని నిలువెత్తూ విషంతో ఉన్న వ్యక్తి ఈటల. నా గెలుపుని ఆయన జీర్ణించుకోలేదు. 2018లో గెలిచినప్పటి నుంచి నాతో మాట్లాడలేదు. నేను పార్టీని కాపాడుకోవడానికి కచ్చితంగా ప్రయత్నం చేస్తా’’ అని గంగుల కమలాకర్‌ అన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని