ద్రవిడ పార్టీలను రజనీ ఢీకొట్టగలరా..?

తాజా వార్తలు

Updated : 04/12/2020 05:12 IST

ద్రవిడ పార్టీలను రజనీ ఢీకొట్టగలరా..?

తలైవాకున్న సవాళ్లేంటి..?

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజకీయాలంటే చిన్న వ్యవహారమేమీ కాదు. ఆచితూచి అడుగులు వేయాలి. ప్రత్యర్థులను ఎదుర్కొనేలా వ్యూహ రచన చేసే నేర్పు కావాలి. ఓటమి ఎదురైనా ఓర్పుగా ఉండాలి. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆయన కార్యాచరణ ఎలా ఉండనుందన్నది ఆసక్తి కలిగిస్తున్న అంశం. తమిళ ప్రజల తలరాత మారుస్తా అంటూ ధీమాగా చెప్పిన తలైవా.. ముందుగానే ఇందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో స్థితిగతులు పరిశీలించారా అన్నది ప్రధానంగా చర్చించాల్సిన విషయం. ఎన్నో ఏళ్లుగా తమిళ రాజకీయాల్లో ద్రవిడ పార్టీలదే పైచేయి. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్‌  అక్కడ నిలదొక్కుకోగలుగుతారా..? సంవత్సరాల పాటు కొనసాగుతున్న ఒరవడికి స్వస్తి పలికి  విజయపతాక ఎగరవేస్తారా..? ఆయన పార్టీ ముందున్న సవాళ్లేంటి? అన్నది పరిశీలిస్తే..

ఏఐడీఎంకే, లేదంటే డీఎంకే. తమిళనాడుని ఏలే పార్టీలు ఈ రెండే. ఇలాంటి ఘనమైన, బలమైన చరిత్ర ఉన్న పార్టీలను ఎదుర్కోవాలంటే... ఎంత సన్నద్ధత కావాలి..? ఎంత సమర్థత ఉండాలి..? ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌ పార్టీకి అవసరమైనవి ఇవే. గతంలో పలువురు సినీనటులు తమిళ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కొందరు విజయం సాధించారు. మరికొందరు విఫలమయ్యారు. కానీ, రజనీకాంత్‌కి ఉన్న చరిష్మా చూసి ఆయన రాజకీయ ప్రస్థానం నల్లేరుపై నడకలాగే ఉంటుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మాస్‌ ఇమేజ్‌ వేరు.. రాజకీయాలు వేరు. ఇదే విషయం గతంలో పలు సందర్భాల్లో తెలిసొచ్చింది కూడా. అలాగని ఏ మాత్రం నిలదొక్కుకోలేరు అని చెప్పటానికీ వీల్లేదు. సరైన ప్రణాళికలు, కార్యాచరణ ఉంటే.. రజనీ ఆధిపత్య పార్టీలకు గట్టి పోటీనివ్వటం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు రాజకీయ పండితులు.

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు రజనీకాంత్ ఏడాదిగా అధ్యయనం చేస్తున్నారని సమాచారం. ఆయనకు అభిమానులు ఎక్కువే కావచ్చు. ఆయనను అలా ఇంటి బయటకు వచ్చి చేయి ఊపినా జనాలు సంబరాలు చేసుకోవచ్చు. కానీ...రాజకీయంగా చూస్తే వీరంతా రజనీకి మద్దతు తెలుపుతారా..? ప్రతి అభిమాని ఓటు రజనీ పార్టీకే పడుతుందా అన్నది కచ్చితంగా చెప్పలేం. ఇది జరగాలంటే నియోజకవర్గాల వారీగా చురుకైన బృందాలను నియమించుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు రాజకీయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటూ అందుకు తగ్గట్టుగా ముందుకు కదలాలి. ముందుగా పార్టీని బలోపేతం చేసుకుని అప్పుడు ఎన్నికల బరిలోకి దిగాలన్నది పలువురి నిపుణుల అభిప్రాయం.

రజనీ వయసు ఇప్పుడు 69 సంవత్సరాలు. ఈ వయసులో క్షేత్రస్థాయిలో చురుగ్గా కదిలి ప్రజలకు చేరువవటం సాధ్యమేనా అన్నది మరో ప్రశ్న. ఇటీవల కాలంలో ఆయన పలు ఆరోగ్య  సమస్యలూ ఎదుర్కొన్నారు. వైద్యులు వద్దంటున్నా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నాననీ ప్రకటించారు. అంటే ఆయన పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసేంత వరకు అలుపెరగకుండా పని చేయాల్సి ఉంటుంది. అందుకు రజనీ ఆరోగ్యం సహకరిస్తుందా అన్నది చూడాలి. ఈ విషయమై పార్టీ శ్రేణులు మాత్రం స్పష్టత ఇస్తున్నాయి. రజనీ ఆరోగ్యం దృష్ట్యా రాజకీయ చర్చలు, వ్యూహ రచనలు అన్నీ పరిమిత సభ్యులతోనే సాగుతున్నట్టు చెబుతున్నాయి. ఇందుకోసం ఐపీఎల్‌లో అనుసరించిన బయో బబుల్‌ విధానాన్నే అనుసరించనున్నారు. ర్యాలీలు, రోడ్‌షోల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోనున్నారు. అత్యంత సన్నిహితులు, పార్టీలోని సీనియర్ నేతలతో మాత్రమే రజనీ చర్చించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.

బెంగళూరులో మరాఠీ కుటుంబంలో జన్మించారు రజనీకాంత్. కానీ, ఆయన ఎప్పుడూ తనను తాను నిజమైన తమిళుడిగానే చెప్పుకున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ...ప్రధాన పార్టీలు రజనీ స్థానిక వ్యక్తి కాదన్న ముద్ర వేసేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తాయి. అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. స్థానిక రాజకీయాలను ఎన్నో ఏళ్ల పాటు శాసించిన జయలలిత, ఎంజీఆర్‌లు తమిళనాడులో జన్మించలేదు. జయలలిత కర్ణాటకలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మలయాళీ అయిన ఎంజీఆర్ శ్రీలంకలో జన్మించారు. అయినా వీరు తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. అలా చూస్తే.. రజనీకాంత్‌కు స్థానికత అంశం పెద్దగా ప్రతికూలత కాకపోవచ్చన్నది ఓ విశ్లేషణ.

కులమతాలకు అతీతమైన ఆధ్యాత్మిక రాజకీయాలకు తాను నాంది పలుకుతానని రజనీకాంత్‌.. పార్టీ ప్రకటించిన సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పలువురు సీనియర్ భాజపా నేతలు రాజకీయ పరంగా రజనీకాంత్, ప్రధాని మోదీ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని ట్వీట్‌ చేశారు. రజనీ రాజకీయాల్లోకి రావటాన్ని స్వాగతించారు. తరవాత కొన్ని పరిణామాలు రజనీ భాజపాకు దగ్గరవుతున్నారా అన్న సందేహాలను రేకెత్తించాయి. అదే జరిగితే రజనీ ఎన్నికల్లో పోటీ చేస్తే మైనార్టీ ఓట్లు కోల్పోతారని అంచనాలూ వేశారు. ప్రస్తుతం ముఖాముఖి పోరుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయన రాజకీయ మైత్రి ఎవరితో ఉండనుందన్నది మరో ఆసక్తికర అంశం.

కర్ణాటకలో పుట్టి  పెరిగిన రజనీకాంత్...ఆ రాష్ట్రంతో కావేరి నదీ జలాల పంపిణీ వివాదం విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది కీలకం కానుంది. సూపర్‌స్టార్ సరైన సమయంలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారన్నది మాత్రం కాదనలేని విషయం. అయితే, రజనీకాంత్‌ను, ఎంజీఆర్‌ను పోల్చి చూస్తూ ఆ స్థాయికి సూపర్‌స్టార్ ఎదుగుతారని సన్నిహిత వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ఈ విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అభిమానులను ఓటర్లుగా మలుచుకోవటంలో పార్టీని బలంగా నిలబెట్టటంలో విజయం సాధించారు ఎంజీర్‌. కానీ, ఇప్పటి పరిస్థితులు వేరు. రాజకీయాల సరళిలోనూ మార్పులు వచ్చాయి. అందుకే రజనీకాంత్ సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దూకితేనే ప్రజల మద్దతు కూడగట్టు కోగలరని స్పష్టమవుతోంది.

ఇక భాజపా విషయానికొస్తే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విజయపతాక ఎగరవేస్తున్న ఆ పార్టీకి తమిళనాడు ఎప్పుడూ సవాలే. అందుకే ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపాతో తమ మైత్రిబంధం ఇలాగే కొనసాగుతుందని ముఖ్యమంత్రి కె. పళనిస్వామి గత నెలలో ప్రకటించారు. అయితే, తమిళనాట భాజపా పుంజు కోవాలంటే రజనీకాంత్ పార్టీతో పొత్తు పెట్టుకోవటం మంచిదన్నది కొందరి అభిప్రాయం. జయలలిత, కరుణానిధి మరణించాక తమిళనాట ఏర్పడ్డ రాజకీయ శూన్యతను రజనీకాంత్‌ భర్తీ చేస్తారన్నది ఇంకొందరి విశ్వాసం. ఈ విశ్లేషణలు, వాదనలు ఎలా ఉన్నా తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠగా సాగనున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని