close
రాజీనామా చేస్తారా? మంత్రులతో చేయిస్తారా?

సచివాలయ ఉద్యోగ పరీక్షల్ని రద్దు చేయాల్సిందే
అక్రమాలు జరిగాయనడానికి విజయసాయిరెడ్డి మాటలే సాక్ష్యం
ఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ

ఈనాడు, అమరావతి: గత 4 నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సమస్యలకు, ప్రజల ఇబ్బందులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుభవ రాహిత్యం, చేతకానితనం, ఆశ్రిత పక్షపాతం, మూర్ఖత్వం, కక్ష సాధింపు వైఖరులే కారణమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలను వెంటనే రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని డిమాండు చేశారు. ఏపీలో సచివాలయ ఉద్యోగ నియామక పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరించి క్రిమినల్‌ కేసులను నమోదు చేయాలని కోరారు. దీనికి బాధ్యులుగా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా? మంత్రులతో చేయిస్తారో? అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.

‘‘గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక ప్రవేశ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలే ప్రభుత్వ వైఫల్యాలకు తాజా ఉదాహరణ. ఇది పంచాయతీరాజ్‌, విద్యాశాఖలకే కాదు.. ఏపీపీఎస్సీ ప్రతిష్ఠకే మాయని మచ్చగా మారింది. సుమారు 19 లక్షల మంది అభ్యర్ధులు, వారి కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. 56 రోజుల వ్యవధిలోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేశామని ఆడంబరంగా ప్రకటించారే తప్ప.. వాటిలో ఎన్ని అక్రమాలు, అవకతవకలు జరిగాయో, ఎంత అధ్వానంగా పరీక్షల నిర్వహణ ఉందో అనే అంశాలను గాలికొదిలేశారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.4 లక్షలకు అమ్ముకున్నారనే కథనాలను మీడియాలో చూశాం.

ర్యాంకుల్లో మతలబు ఏమిటి?
ప్రశ్నపత్రాలు ఏపీపీఎస్సీ కంటే ముందే విశ్రాంత అధికారికి, కమిషన్‌ కార్యాలయంలోని పొరుగు సేవల సిబ్బందికి ఎలా అందాయి? ముద్రాపకులకు ప్రశ్నపత్రాల మెయిల్‌ ఎక్కడ నుంచి వెళ్లింది? పొరుగు సేవల సిబ్బంది, వారి బంధువులకే అగ్రశ్రేణి ర్యాంకులు దక్కడంలో మతలబేంటి? ఇందులో ఏపీపీఎస్సీ, పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ, విద్యాశాఖల బాధ్యత ఎంత? అని ఉద్యోగాలు రాని అభ్యర్ధులు నిలదీస్తున్నారు. వీరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ‘గ్రామ వాలంటీర్లలో 90శాతం ఉద్యోగాలు మన కార్యకర్తలకే వచ్చాయి. నా దగ్గర వాటికి సంబంధించిన లెక్కలన్నీ ఉన్నాయి. గ్రామ సచివాలయ ఉద్యోగాలూ మన కార్యకర్తలకే వచ్చాయి’ అని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత (విజయసాయిరెడ్డి) బాహాటంగా ప్రకటించిన వీడియో క్లిప్పింగులే పరీక్ష నిర్వహణలో అక్రమాలకు ప్రబల సాక్ష్యం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.