close

ప్రధానాంశాలు

వైభవంగా భరణి కృత్తిక

భారీగా తరలివచ్చిన భక్తులు

కావళ్లతో మురుగన్‌ సన్నిధిలో సందడి

ఆలయం వద్ద కావళ్లతో వేచి ఉన్న భక్తులు
 

తిరుత్తణి, తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడి మాసం భరణి కృత్తిక ఉత్సవం గురువారం వైభవంగా జరిగింది. తిరుత్తణి కొండపై వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో బుధవారం నుంచి నాలుగు రోజులపాటు జరగనున్న ఆడికృత్తిక ఉత్సవాల్లో భాగంగా గురువారం భరణి కృత్తిక జరిగింది. వేకువజామున 4 గంటలకు సుబ్రహ్మణ్యస్వామి మూలవిరాట్టు, వల్లి, దేవయాని సమేత ఉత్సవ మూర్తికి ప్రత్యేక అభిషేకాలు, తిరుమంజన సేవ చేశారు. అనంతరం దేవేరులను ప్రత్యేకంగా అలంకరించి శాస్త్రోక్తకంగా భరణి కృత్తిక పూజలు, మహా దీపారాధన చేపట్టారు. రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున పాదయాత్రగా, రైళ్లు, వివిధ వాహనాల్లో భక్తులు తిరుత్తణికి తరలివచ్చారు. శరవన పొయిగై పుష్కరణిలో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. భరణి కావడి మోసుకుని, శరీరానికి, నోటికి శూలాలు గుచ్చుకుని కొండపైకి చేరుకుని ఆలయ ప్రదక్షణ చేసి కావడి మండపంలో కావళ్లను చెల్లించారు. తర్వాత స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేకువజామున 5 గంటల నుంచి రాత్రి వరకు ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి.

నోటికి శూలాలు గుచ్చుకొని మొక్కులు తీర్చుకోవడానికి వెళుతున్న మహిళలు

ఐదు ప్రాంతాల్లో తాత్కాలిక బస్టాండ్లు: తక్కార్‌ జయశంకర్‌

ఆడి కృత్తిక సందర్భంగా తిరుత్తణికి తరలివచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పట్టణ శివారులో ఐదు ప్రాంతాల్లో తాత్కాలిక బస్టాండులు, ద్విచక్ర వాహనాలతోపాటు కార్లు, ఇతర వాహనాలను ఆపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ తక్కార్‌ జయశంకర్‌ పేర్కొన్నారు. తిరుత్తణి పట్టణంతోపాటు కొండపైన పోలీసు భద్రతను పటిష్ఠం చేశామన్నారు. పట్టణంలో వాహన రద్దీని నియంత్రించడానికి చెన్నై, తిరువళ్ళూరు, ఆవడి, పూందమల్లి మార్గాల నుంచి వచ్చే బస్సులకు స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో, ఊత్తుకోట, పొన్నేరి, గుమ్మిపూండి, చిత్తూరు, తిరుపతి మార్గంలో వచ్చే బస్సులను చిత్తూరు రోడ్డు వద్ద, ఆర్‌కేపేట, పళ్ళిపట్టు మార్గాల నుంచి వచ్చే బస్సులను కేజీ కండ్రిగ కూడిలి వద్ద, వందవాసి, షోలింగర్‌, దిండివనం, తిరువణ్ణామలై, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు ప్రాంతాల వచ్చే బస్సులను అరక్కోణం రహదారిలోని ప్రభుత్వ రవాణా సంస్థ సమీప ప్రాంతం సహా ఐదు స్థలాల్లో తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేశామన్నారు. అక్కడక్కడా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. కలెక్టర్‌ మహేశ్వరి రవికుమార్‌ ఆదేశాలతో తిరువళ్ళూరు, కడంబత్తూరు నుంచి అరక్కోణానికి తిరిగే విద్యుత్తు రైళ్లను తిరుత్తణి వరకు పొడిగించడానికి సంబంధిత రైల్వే అధికారితో మాట్లాడి చర్యలు తీసుకున్నట్లు తక్కార్‌ జయకుమార్‌ పేర్కొన్నారు. పట్టణంలోకి ఆటోలు తప్ప ఇతర వాహనాలను 27వ తేదీ వరకు నిషేధించామన్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి: జ్ఞానశేఖర్‌, ఆలయ ఈవో

ఆడికృత్తిక సందర్భంగా తిరుత్తణి కొండకు తరలివస్తున్న భక్తులు ఇబ్బంది పడకుండా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో జ్ఞానశేఖర్‌ పేర్కొన్నారు. ఆయన గురువారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ భరణి కృత్తిక సందర్భంగా గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 2.65 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శంచుకున్నారన్నారు. శుక్రవారం ఆడి కృత్తిక సందర్భంగా సుమారు 8 లక్షల మందికిపైగా భక్తులు కావళ్లతో తరలివస్తారని అంచనా వేశామని, దానికి తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తొక్కిసలాట జరగకుండా సులభంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు విద్యుత్తు, రోజుకు 2 లక్షల లీటర్ల తాగునీటి సరఫరా, 20 ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు సహా వంద శాతం కనీస సదుపాయాలు కల్పించామన్నారు. చోరీలు, దోపిడీల నియంత్రణకు ఆలయం లోపల, చుట్టూ వివిధ మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ప్రత్యేక కంట్రోలు రూం ఏర్పాటుచేసి నింతర పర్యవేక్షణ, నిఘా ఏర్పాటు చేశామన్నారు. భక్తుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడానికి వీలుగా కొండపైన తాత్కాలిక పోలీసు స్టేషన్‌ అందుబాటులో ఉందన్నారు. సంచార వైద్య శిబిరాలు, ఇతర అన్ని వసతులు కల్పించామన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.