close
పంజాగుట్టలోనే అంబేడ్కర్‌ విగ్రహం పునః ప్రతిష్ఠించాలి 

బాధ్యులైన పోలీసులు, అధికారులపై చర్యలు తీసుకోవాలి 
మందకృష్ణ ఆధ్వర్యంలో గవర్నర్‌ను కలిసిన విపక్ష నేతలు 
ప్రభుత్వం అంటరానితనాన్ని  పాటిస్తోందని ధ్వజం 
ఘటనపై సీఎం కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పంజాగుట్ట చౌరస్తాలో కూల్చివేసిన భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాన్ని యథాస్థానంలో తిరిగి పునః ప్రతిష్ఠించాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. విగ్రహం కూల్చివేతకు బాధ్యులైన జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సానుకూల చర్యలు చేపట్టకపోతే జాతీయ ఎస్సీ కమిషన్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహ విధ్వంస వ్యతిరేక పోరాట సంయుక్త కార్యాచరణ కమిటీ ఛైర్మన్‌ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు షబ్బీర్‌అలీ, శ్రీధర్‌బాబు, మల్లురవి, తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, భాజపా మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ జనసమితి నాయకులు ప్రొ.పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్‌, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌, జేఏసీ నాయకులు దీపక్‌ కుమార్‌, వెంకటేశ్‌, రాగతి సత్యం మాదిగ తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ..రాజ్యాంగంలో దళితులపై అంటరానితనం నిషేధించినా..కేసీఆర్‌ ప్రభుత్వం మాత్రం దాన్ని పాటిస్తోందని ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ముక్కలు చేసి చెత్త డంపింగ్‌ యార్డులో పడేసిన ఘటనలో ఆదేశాలిచ్చిన, కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోకుండా...చెత్త డంపింగ్‌ యార్డుకు తరలించిన దళితులైన ఇద్దరు డ్రైవర్లను జైలుకు పంపించారన్నారు. ప్రభుత్వం అంటరానితనాన్ని పాటిస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. పోరాడి సాధించకున్న తెలంగాణలో దళితులకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఇందిరాపార్కు వద్ద రోజూ అనేక ధర్నాలు స్థానిక పోలీసుల అనుమతితో జరుగుతుంటే..దళిత సంఘాల ధర్నాకు మాత్రం హైకోర్టు అనుమతి అవసరమైందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో అనేక మంది విగ్రహాలు అనుమతులు లేకుండానే ఉన్నాయని..వాటిని వదిలేసి అంబేడ్కర్‌ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకోవడమేంటని నిలదీశారు. పంజాగుట్ట ఘటన జరిగి నెలరోజులైనా కేసీఆర్‌ నోరు విప్పడం లేదని, సీఎం హోదాలో స్పందించాలని మందకృష్ణ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..అంబేడ్కర్‌ విగ్రహం కూల్చివేసిన ఘటనపై సభ్యసమాజం సిగ్గుతో తల దించుకుందన్నారు. దళితులు, బడుగు, బలహీనవర్గాల పట్ల తెరాస ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. కోట్లాది మంది దైవంగా పూజించే అంబేడ్కర్‌ విగ్రహం కూల్చివేయడం దురదృష్టకరమని, తిరిగి యథాస్థానంలో పునః ప్రతిష్ఠించాలని కిషన్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి, రమణ, చెరకు సుధాకర్‌, పీఎల్‌.విశ్వేశ్వర్‌రావు, గోవర్ధన్‌ తదితరులు డిమాండ్‌ చేశారు. హక్కుల కోసం పోరాడే గొంతుకలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.