ఉత్సాహంగా ముగిసిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం
ఉత్సాహంగా ముగిసిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం

వాషింగ్టన్‌: తానా ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ తానాతో పాటు 40 దేశాల్లోని 100కు పైగా తెలుగు సంఘాలు నిర్వహించిన ఈ సాంస్కృతిక మహోత్సవాలు ఆగస్టు 2తో పూర్తయ్యాయి. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా జులై 24న ప్రారంభమైన ఈ వేడుకలు 10 రోజులపాటు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. వెబ్‌ ఎక్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన ఈ సంబరాలకు తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి అధ్యక్షత వహించగా.. శిరీష తూనుగుంట సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ ముగింపు కార్యక్రమంలో లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ, తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి, జీఎంఆర్‌ అదినేత గ్రంధి మల్లిఖార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా గ్రంధి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఇలాంటి కార్యక్రమం రూపొందించడం, సాంస్కృతిక పోటీల్లో 18వేల మంది తెలుగు వారు పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రతి ఆపద సమయాన్ని తెలుగు వారు ఉపయోగంగా మలుచుకొని ఎలా ముందుకెళ్తారో ఈ కార్యక్రమం ద్వారా నిరూపించారన్నారు. కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన తానా అధ్యక్షుడు జయశేఖర్‌ తాళ్లూరి, మహిళా విభాగం సమన్వయకర్త శిరీష తూనుగుంట్లను ఆయన ప్రశంసించారు. తెలుగు భాషకు, సంస్కృతికి ఈ ఉత్సవాలు గొప్ప భరోసానిచ్చాయన్నారు. మాతృభాషకు ఏ ప్రమాదం రాదని ఈ ఉత్సవాలను చూసిన తర్వాత అనిపించిందని చెప్పారు.

ప్రధానాంశాలైన సౌందర్యలహరి, తెలుగు వెలుగు, రాగమంజరి, నాదామృతం, అందెలరవళి, కళాకృతి, రంగస్థలం, భువన విజయంపై జరిగిన పోటీల్లో నెగ్గిన విజేతల పేర్లు ప్రకటించారు. వివిధ దేశాలకు చెందిన 485 మంది విజేతలుగా నిలిచారు. వారందరికీ బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. ఆగస్టు 2న సాయంత్రం 6గంటలకు ప్రారంభమైన ఈ సంబరాలు మరుసటి రోజు ఉదయం 3గంటల వరకు కొనసాగాయి. ప్రపంచ నలుమూలల నుంచి వివిధ టైం జోన్‌లకు చెందిన తెలుగువారు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వివిధ తెలుగు సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలు ఒక మధురానుభూతిగా నిలిచిపోతాయని, ఎక్కడెక్కడో ఉన్నవారంతా తానా కృషి ఫలితంగా ఒకే వేదికపై కలుసుకున్నామని ఆనందం వ్యక్తంచేశారు. తామంతా తెలుగు భాషను పరిరక్షించుకోవడంలో సైనికుల్లా పనిచేస్తామని ప్రకటించారు. ఈ సమావేశాల్లో జస్టిస్‌ ఈశ్వరయ్య, పద్మశ్రీ మల్లేశం, తానా పూర్వ అధ్యక్షులు జంపాల చౌదరి, రంగస్థల నటులు మీగడ రామలింగ స్వామి, గుమ్మడి గోపాలకృష్ణ, తానా ప్రముఖలు హరి కోయ, జయశేఖర్‌ తాళ్లూరి, భారతీయం సత్యవాణి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. అతిథులంతా ఏటా ఇలాంటి ఉత్సవాలు నిర్వహించాలని కోరగా.. ‘ఎల్లలు లేని తెలుగు - ఎప్పటికీ తెలుగు’ అనే కార్యక్రమం కింద ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తామని తానా అధ్యక్షుడు జయ్‌ తాళ్లూరి అన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా రూ.10లక్షలు చేనేత కార్మికులు, పేద కళాకారుల కోసం ప్రకటించారు. అనంతరం శిరీష తూనుగుంట్ల వందన సమర్పణ చేశారు. 

Tags :

మరిన్ని