అన్నమయ్య బోధించిన సామాజిక స్పృహ అలవర్చుకోవాలి
అన్నమయ్య బోధించిన సామాజిక స్పృహ అలవర్చుకోవాలి

సింగపూర్‌: ప్రముఖ వాగేయకారుడు అన్నమయ్య బోధించిన సామాజిక స్పృహను ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న తెలుగు వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వీధి అరుగు’ వేదిక ఆధ్వర్యంలో ‘అన్నమయ్య సంకీర్తనలు - సామాజిక దృక్పథం’ అనే అంతర్జాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రామంలో దాదాపు 16 దేశాలు నుంచి 400 మందిపైగా తెలుగు వారు పాల్గొన్నారు. సుమారు 2,600 మంది ఫేస్‌బుక్‌ ద్వారా వీక్షించారు. దాదాపు రెండు గంటలు పాటు సాగిన ఈ కార్యక్రమంలో అన్నమయ్య సంకీర్తనలలోని సామాజిక స్పృహ అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచన కర్త కొండవీటి జ్యోతిర్మయి అద్భుతంగా ప్రసంగించారు. రాధిక మంగిపూడి అనుసంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో మొదట జర్మనీ నుంచి ప్రముఖ గాయని శివాని సరస్వతుల ‘భావయామి గోపాలబాలం’, ‘బ్రహ్మమొక్కటే’ అన్నమయ్య సంకీర్తనలను తన సుమధుర గాత్రంతో ఆలపించి అందరిని అలరించారు.

ఈ సందర్భంగా కొండవీటి జ్యోతిర్మయి మాట్లాడుతూ ‘కలియుగ ధర్మానికి అనుగుణంగా జనబాహుళ్యంలోకి సులువుగా చొచ్చుకుపోయే విధంగా సంకీర్తనా మార్గాన్ని ఎంచుకున్నారు అన్నమయ్య. చక్కటి తేట తెలుగు భాషలో శ్రోతల హృదయాంతరాలను తాకే పదాల కూర్పుతో అద్భుతమైన సంకీర్తనలు రచించారు. కుల, మత, జాతి వివక్షతను పక్కనపెట్టి వాటిని అర్థం చేసుకోవాలి. అన్నమయ్య బోధించిన సామాజిక స్పృహ అలవర్చుకోవాలి’ అని ప్రవచించారు. సందర్భోచితమైన అన్నమయ్య సంకీర్తనలను, మధ్యలో ఉదహరించి శ్రావ్యంగా పాడుతూ ఆమె ఇచ్చిన సందేశం అందరిని కట్టిపడేసింది.

జ్యోతిర్మయి నిర్వహిస్తున్న ‘అన్నమయ్య యోగిక్‌ లైఫ్‌’ కార్యక్రమం ద్వారా ఎంతోమందిని నిరాశ నిస్పృహల నుంచి బయటకు తీసుకురావడానికి దోహదపడే కార్యక్రమాలను ‘వీధి అరుగు’ వేదిక ద్వారా ప్రవాసులందరికీ పరిచయం చేయడానికి కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తరిగోపుల వెంకటపతి, జోజెడ్ల సుబ్బారావు తెలిపారు. కార్యక్రమంలో దీర్ఘాసి విజయ్ భాస్కర్, నాగభైరవ రవిచంద్ర, పారా అశోక్ కుమార్, లక్ష్మణ్, పర్రి విజయ్ కుమార్, అన్నపూర్ణ మహీంద్ర, తొట్టెంపూడి గణేష్, కొక్కుల సత్యనారాయణ, దాసరి శ్రీని, గురుభగవతుల శైలేష్, కవుటూరు రత్నకుమార్, నాయుడు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Advertisement


మరిన్ని