కర్నూలు కార్పొరేషన్‌కు పారిశుద్ధ్య వాహనాలు అందజేత
కర్నూలు కార్పొరేషన్‌కు పారిశుద్ధ్య వాహనాలు అందజేత

కర్నూలు: సేవా కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు నగరపాలక సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి, వంశీ గ్రూప్ అధినేత ముప్పా రాజశేఖర్ సంయుక్తంగా రూ.7 లక్షల విలువైన రెండు పారిశుద్ధ్య వాహనాలను అందజేశారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ద్వారా మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీకి వాహన పత్రాలను అందించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న తానా కార్యదర్శి పొట్లూరి రవి, ముప్పా రాజశేఖర్‌లను అభినందించారు. అంతే కాకుండా తానా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కర్నూలులోని ఎన్‍ఆర్‍ఐ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు చదువుకోవాలన్న ఆశయంతో జిల్లాకు చెందిన 100 మంది పేద విద్యార్థులకు పొట్లూరి రవి సహకారంతో రూ.15 లక్షలు విలువైన ఉపకార వేతనాలు అందించినట్లు ముప్పా రాజశేఖర్ తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉత్తమ శిక్షణ ఇచ్చేందుకు అన్ని సదుపాయాలతో కూడిన విద్యాసంస్థను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు ఎన్‍ఆర్‌ఐ ఫౌండేషన్‍ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అవసరమైతే సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లాకు చెందిన కళాకారులు, మేధావులు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలు సైతం అందజేస్తామని ముప్పా రాజశేఖర్‍ వివరించారు.

Advertisement

Advertisement


మరిన్ని