అక్కడి వారికి అంత్యక్రియలే పెద్ద పండుగ!
అక్కడి వారికి అంత్యక్రియలే పెద్ద పండుగ!

(Photo: Indonesia.Travel youtube video screenshot)

ఒక మనిషి కన్నుమూసిన అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య మృతదేహానికి అంతిమ సంస్కారాలు జరిగిపోతాయి. ఎంత గొప్పగా బతికినా, ఎంత కాలం జీవించినా ఈ కర్మకాండ గంటల వ్యవధిలో పూర్తవుతుంది. ఇది అనాది నుంచి వస్తున్న సంప్రదాయమే. అయితే, ఇండోనేషియాలోని టానా టోరాజా ప్రాంతానికి చెందిన ప్రజలకు అంతిమ సంస్కారాలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడి ప్రజలు అంత్యక్రియలు జరపాలంటే ఊర్లో ప్రజలందరి కోసం కనీసం వారంపాటు విందు, వినోదాలతో పెద్ద వేడుక నిర్వహించాలి. ఆ తర్వాతే అంతిమ సంస్కారాలు జరపాలి. ఈ మేరకు డబ్బులు సమకూర్చడం కోసం అంత్యక్రియలను మృతుల కుటుంబాలు వారాలు, నెలలు, సంవత్సరాలు వాయిదా వేస్తుంటాయి.

టానా టోరాజా ప్రాంతంలో దాదాపు 2.3లక్షల జనాభా ఉన్నట్లు సమాచారం. ఇక్కడి టోరాజా తెగ ప్రజలు పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయాలను తూచ తప్పకుండా పాటిస్తుంటారు. పర్వదినాలు, వివాహాది శుభకార్యాలకన్నా.. అంతిమ సంస్కారాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఈ క్రమంలోనే అంత్యక్రియలను ఓ పండుగలా నిర్వహిస్తుంటారు. ఎవరైనా చనిపోతే వారి కోసం ఇంట్లోనే ఒక ప్రత్యేక గదిని నిర్మించి అందులో మృతదేహాన్ని ఉంచుతారు. పండుగ చేయడానికి సరిపడ డబ్బులు సమకూరే వరకు మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించరు. దీనికి ఎంతకాలమైనా పట్టొచ్చు. అప్పటి వరకు అసలు మృతులను మృతి చెందినట్లుగానే పరిగణించరు. అనారోగ్యంగా ఉన్నారనో.. విశ్రాంతి తీసుకుంటున్నారనో భావిస్తారట. వారి కోసం ప్రతి రోజు భోజనం ఏర్పాట్లు చేస్తారు. మృతదేహం భోజనం చేయదు. కానీ, సంప్రదాయం ప్రకారం అలా నైవేద్యంలా పెడుతుంటారట.

డబ్బు సమకూరిందా.. ఇక పండగే

ఎప్పుడైతే డబ్బు సమకూరుతుందో అప్పుడు అంత్యక్రియలు ప్రారంభిస్తారు. వారింట్లో జరిగే ఈ కార్యక్రమానికి ఊరంతా హాజరవుతుంది. మొదట గేదెలు, పందులను బలిస్తారు. ఇవి మృతులకు తోడుగా వెళ్తాయని అక్కడివారి విశ్వాసం. స్థోమతను బట్టి బలి ఇచ్చే జంతువుల సంఖ్య పెరుగుతుంటోంది. ఆ తర్వాత జంతువుల మాంసాన్ని ఊరంతా పంచుతారు. వారి సంప్రదాయ నృత్యాలు, కచేరీలతో కొన్ని రోజులపాటు ఈ వేడుక కొనసాగుతుంది. ఈ వేడుకలు పూర్తయిన తర్వాత మృతదేహాన్ని సమీపంలో ఉండే కొండలకు వేలాడదీస్తుంటారు లేదా కొండలోనే ఒక గుహ ఏర్పాటు చేసి అందులో భద్రపరుస్తారు. వారి గుర్తుగా చెక్క బొమ్మలను ఉంచుతారు. ఇక నోట్లో పళ్లు ఇంకా రాని చిన్నారులు చనిపోతే వారిని ఒక చెట్టులో భద్రపరుస్తారు. చెట్టు కాండంలో ఒక రంధ్రం చేసి అందులో చిన్నారిని పెట్టి, చెక్కతో చేసిన తలుపుతో మూసివేస్తారు. ఇలా చేయడం వల్ల చిన్నారి శరీరం, ఆత్మ చెట్టులో భాగమవుతుందని నమ్ముతారు. 

మానెనె సంప్రదాయం

ఖననం చేసిన మృతదేహాలను కొన్నాళ్లకు అస్థిపంజరాలుగా మారతాయి. అయినా వాటిని అక్కడి ప్రజలు బతికున్న కుటుంబసభ్యులుగానే భావిస్తారు. అందుకే ఏటా ఆగస్టు/సెప్టెంబర్‌ నెలల్లో మరణించిన వారి కోసం ‘మానెనె’ అనే వేడుక నిర్వహిస్తారు. గుహాల్లో భద్రపర్చిన, కొండలకు వేలాడదీసిన మృతదేహాలు/అస్థిపంజరాలను ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసి, కొత్త వస్త్రాలు తొడిగి వేడుక జరుపుకుంటారు. చిన్నారులు నుంచి పెద్దల వరకు అస్థిపంజరాలతో ముచ్చటిస్తారు. అనంతరం మళ్లీ ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టేస్తారు. బతికున్న మనుషుల్నే సరిగా చూసుకొని కుటుంబసభ్యులున్న ఈ కాలంలో.. ఇప్పటికీ మృతదేహాలపై ఇంతలా ప్రేమగా చూపుతున్న టోరాజా ప్రజలను ప్రశంసించాల్సిందే. ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమాన్ని సందర్శించేందుకు ఇండోనేషియా టూరిజంలో ప్రత్యేక ప్యాకేజీలు ఉండటం గమనార్హం.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Advertisement

Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని