అమెరికాలో కాల్పులు: ఆరుగురి మృతి
close
అమెరికాలో కాల్పులు: ఆరుగురి మృతి

మిల్‌వాకీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన నిందితుడితో సహా ఆరుగురు మృతి చెందారు. మిల్‌వాకీ నగరంలోని మెల్సన్‌ కూర్స్‌ బీర్ల కంపెనీలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 51 ఏళ్ల వ్యక్తి మెల్సన్‌ కూర్స్‌ కంపెనీలోకి చొరబడి ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు.

ఘటన తర్వాత కాల్పులకు పాల్పడిన నిందితుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడు.. సంస్థ మాజీ ఉద్యోగిగా గుర్తించారు. కొంత కాలం క్రితం అతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు సమాచారం. సంస్థలో పనిచేస్తున్న మరో ఉద్యోగి ఐడీ కార్డు దొంగిలించి సంస్థలోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడినట్లు గుర్తించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉద్యోగం నుంచి తొలగించారన్న కక్షతోనే నిందితుడు కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నిందితుడితో సహా మొత్తం ఆరుగురు మృతి చెందారని మిల్‌వాకీ మేయర్‌ టామ్‌ బారట్‌ వెల్లడించారు. 


Tags :

మరిన్ని