ఈ దీవిని రెండు దేశాలు పంచుకుంటున్నాయ్‌
ఈ దీవిని రెండు దేశాలు పంచుకుంటున్నాయ్‌

(ఫోటో: గూగుల్‌ మ్యాప్‌ స్క్రీన్‌ షాట్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిహద్దులు, భూభాగం విషయంలో ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి. కొన్ని దేశాల మధ్య ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ఏదైనా భూభాగం ఉంటే దాన్ని స్వాధీనం చేసుకోవడం ఇరు దేశాలు కయ్యానికైనా సిద్ధపడతాయి. కానీ, ఓ ఐలాండ్‌ను రెండు దేశాలు సామరస్యంగా పంచుకొని ఎంతో చక్కగా చూసుకుంటున్నాయి. పంచుకోవడం అంటే ఐలాండ్‌ను రెండు భాగాలు చేయలేదండోయ్‌.. ఆ దీవిపై అధికారాన్ని సమానంగా పంచుకున్నాయి.. ఎలాగంటారా? 

స్పెయిన్‌.. ఫ్రాన్స్‌ మధ్య ఉండే బిడొసోవా నదిలో ఫియజంట్‌ పేరుతో ఒక ఐలాండ్‌ ఉంది. ఇక్కడ మనుషుల జాడ కనిపించదు. నిర్మానుష్యమైన ప్రాంతం. కాల క్రమంలో ఈ ఐలాండ్‌ తరిగిపోతోంది. 2018 లెక్కల ప్రకారం ఆ ఐలాండ్‌ 200 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. కొన్నిశతాబ్దాల కిందట ఈ ఐలాండ్‌ మాదంటే మాదని ఫ్రాన్స్‌.. స్పెయిన్‌ వాదించాయి. కానీ, 1659లో పైరినీస్‌ ఒప్పందం కుదరడంతో ఆ ఐలాండ్‌పై ఇరు దేశాలు సమానంగా సార్వభౌమత్వాన్ని పొందాయి. ఈ ఐలాండ్‌పై ఏడాదిలో ఆరు నెలలు స్పెయిన్‌, మరో ఆరు నెలలు ఫ్రాన్స్‌ అధికారం పంచుకున్నాయి.  ప్రతి ఐదు రోజులకు ఒకసారి నేవీ సిబ్బంది ఇక్కడికి వచ్చి పరిశీలిస్తారు. ఆరు నెలలకోసారి ఇరు దేశాలకు చెందిన మున్సిపాలిటీ సిబ్బంది ఐలాండ్‌ను శుభ్రపరుస్తారు. చరిత్రలో ఇరు దేశాలకు చెందిన పలు కీలక సమావేశాలు ఈ ఐలాండ్‌లోనే జరిగాయి. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తప్ప మరెవరూ ఈ ఐలాండ్‌ను సందర్శించే అవకాశం లేదు.

Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని